
కార్పొరేటు విద్య
రూ.వేలల్లో ఫీజులు వసూలు
యథేచ్ఛగా ప్రయివేట్ స్కూళ్ల దందా
పట్టించుకోని ప్రభుత్వం
అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు
విశాఖ ఎడ్యుకేషన్: సాంకేతిక విప్లవంతో విద్యా ప్రమాణాల్లో ఎప్పటికప్పుడు పెను మార్పు లు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే పిల్లలకు మంచి విద్య అందించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది. నాణ్యమైన విద్యనందించడంలో ప్రభుత్వ పాఠశాలలు బాగా వెనుకబడి పోవడంతో ప్రయివేట్ విద్యా సంస్థల దందా కొనసాగుతోంది. కాస్త మెరుగైన విద్యనందిస్తుండడంతో సామా న్య ప్రజలు సైతం ప్రయివేట్ స్కూళ్లవైపు పరుగులు తీసున్నారు. అప్పోసొప్పో చేసి ఆ పాఠశాలల యాజమాన్యం అడిగినంత సమర్పించుకుని తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం అందులో చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంస్థలు ప్రతి ఏటా ఫీజులు పెంచేసి ఎడాపెడా సొమ్ములు గుంజేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్, టెక్నో, ఈ-టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్ పేరుతో రోజుకో పాఠశాల పుట్టుకొస్తూ విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చేశాయి.
జూన్ వచ్చిందంటే హడల్...
ఏటా జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఈ నెల వచ్చిందంటే హడలిపోతారు. దానికి కారణం పిల్లల చదువులు... వాటి కోసం ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు రకరకాల పేర్లతో వసూలు చేసే ఫీజులే. కార్పొరేట్ పాఠశాలలో కొత్తగా ఓ విద్యార్థిని ఎల్‌కేజీలో చేర్చేందుకు అప్లికేషన్ ఫీజు, అడ్మిషన్, బిల్డింగ్ ఫండ్ అంటూ రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్, షూలు కలిపి మరో రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుపెట్టిస్తున్నా రు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్థాయిలో ఫీజులు చెల్లించడానికి ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టడమో లేదా అప్పులు చేయడమో తప్పడం లేదు.
ప్రభుత్వ స్కూళ్లలో కొరవడ్డ విద్యా ప్రమాణాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో ఫీజులు ఎక్కువైనా ప్రయివేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదివించాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ చెబుతున్న మాటలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో కూడా విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
విద్యా హక్కు చట్టం అమలు శూన్యం
ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం 8వ తరగతి వరకు ఫీజులు వసూలు చేయకూడదనే నిబంధన ఉన్న అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రయివేట్ పాఠశాలల్లో కచ్చితంగా క్రీడా మైదానం, అగ్నిమాపక పరికరాల ఏర్పాటుతో పాటు ఫీజుల నియంత్రణపై కమిటీల ద్వారా పర్యవేక్షణ జరిపి తల్లిదండ్రులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఈ చట్టాన్ని ప్రయివేట్ పాఠశాలలు అస్సలు అనుసరించడం లేదు. పుస్తకాలు, యూనిఫాం స్కూళ్లలో విక్రయించరాదన్న నిబంధన ఉన్న బహిరంగంగానే వీటి అమ్మకాలు సాగుతున్నాయి. పలు పాఠశాలలు కొన్ని షాపులతో బేరం కుదుర్చుకొని తమ విద్యార్థులను వారి వద్దకు పంపిస్తున్నాయి. మొత్తం మీద చదువుల పేరుతో సాగుతున్న ఫీజుల దందాకు సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రుల నడ్డి విరిగిపోతోంది.