వాణిజ్యంలో ‘అవినీతి’ కలకలం | corruption caused on Trade in vizianagaram | Sakshi
Sakshi News home page

వాణిజ్యంలో ‘అవినీతి’ కలకలం

Published Wed, Apr 5 2017 1:01 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

corruption caused on Trade in vizianagaram

► ట్యాక్స్‌ తగ్గించేందుకు లంచం డిమాండ్‌
► రూ. 50వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం
► డీసీటీఓ, ఏసీటీఓలపై కేసు నమోదు
► కలకలం రేపిన ఏసీబీ దాడులు

ఏసీబీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే పార్వతీపురం డివిజన్‌లో ఇద్దరిని వరుసగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయినా మిగిలిన అధికారుల తీరులో మార్పురావడంలేదు. ఇందుకు తాజా ఉదాహరణే మంగళవారం మరోఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన వైనం. ట్యాక్స్‌ తగ్గించేందుకు రూ. 50వేలు లంచం తీసుకుంటూ డీసీటీఓ, ఏసీటీఓ ఈ సారి ఏసీబీకి చిక్కారు.

పార్వతీపురంటౌన్‌: నెలరోజుల వ్యవధిలో పార్వతీపురం డివిజన్‌లో రెండుచోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి చేపలను వలపన్ని పట్టుకున్న సంఘటనలు ఇంకా మరువకముందే మరో రెండు అవినీతి చేపలు మంగళవారం ఏసీబీ వలకు చిక్కాయి. రూ. 50వేలు లంచం తీసుకుంటూ పార్వతీపురం వాణిజ్య పన్నులశాఖలో పనిచేస్తున్న డీసీటీఓ(ఇన్‌చార్జ్‌ సీటీఓ) ఎచ్చెర్ల మన్మథరావు, ఏసీటీఓ వి.వి.ఎల్‌.ఎన్‌.మూర్తిలు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ షకీలాభాను ఆధ్వర్యంలో ఏసీబీ బృందం మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాడులు జరిపి లంచం తీసుకుంటున్న డీసీటీఓ, ఏసీటీఓలను అదుపులోకి తీసుకున్నారు.

రైతు బజారు కూడళ్లలోని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో డీసీటీఓ కార్యాలయంలోనే బాధితుడు కొత్తకోట ప్రసాద్‌ రూ. 50వేలు ఏసీటీఓకు ఇస్తుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. పార్వతీపురం పట్టణానికి చెందిన వ్యాపారి కొత్తకోట ప్రసాద్‌కు సుమిత్ర కలెక్షన్స్‌ పేరుతో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ఉంది. విధి నిర్వహణలో భాగంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులైన డీసీటీఓ మన్మథరావు, ఏసీటీఓ వి.వి.ఎల్‌.ఎన్‌.మూర్తి ఫిబ్రవరి 23న సుమిత్ర కలెక్షన్స్‌ షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అనంతరం రికార్డులను పట్టుకొని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయానికి వెళ్లిపోయారు. షాపు యజమాని కొత్తకోట ప్రసాద్‌ కార్యాలయానికి వెళ్లగా ఆయన పన్నులు సక్రమంగా చెల్లించలేదని, ఐదారు లక్షల వరకు పన్ను కట్టాల్సి వుంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రసాద్‌ ప్రతీనెలా పన్నులు కడుతున్నానని, అంత పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేనని ప్రాధేయపడ్డాడు. అయితే పన్నును తగ్గిస్తామని తమకు లంచం ఇవ్వాలని డీసీటీఓ డిమాండ్‌ చేశారు. ఐదారు లక్షల పన్ను చెల్లించాల్సి ఉండగా దానిని రూ. 50వేలకు కుదించి అపరాథరుసుంగా మరో రూ. 50వేలు కలిపి లక్ష రూపాయలు ట్యాక్స్‌ చెల్లించాలని చూపించేందుకు తమకు రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంతమొత్తం ఇచ్చుకోలేనని ప్రసాద్‌ చెప్పినప్పటికీ రికార్డులు అప్పజెప్పలేదు. విసిగిపోయిన ప్రసాద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకొని పథకం పన్నారు. ఇందులో భాగంగా కొత్తకోట ప్రసాద్‌ చేత మంగళవారం డీసీటీఓకు ఫోన్‌ చేసి మీరగిన డబ్బులు ఇచ్చేస్తాను. ఎక్కడికి రావాలని అడిగించారు. ఆ డబ్బును ఏసీటీఓ మూర్తికి ఇవ్వమని ఆయన ఫోన్‌లో చెప్పారు. వెంటనే ప్రసాద్‌ ఏసీబీ అధికారులు ఇచ్చిన 25 రూ. రెండువేల నోట్లను(రూ. 50వేలు) తీసుకొని డీసీటీఓ చాంబర్‌లోవున్న ఏసీటీఓ మూర్తికి ఇచ్చారు. ఆ నగదును డీసీటీఓకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని విచారణ జరిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

తప్పుడు లెక్కలతో ఇబ్బంది పెట్టారు.
సుమిత్ర కలెక్షన్స్‌ షాపులో గత నెల 23న రికార్డులు పరిశీలించిన డీసీటీఓ, ఏసీటీవో రికార్డులను వారి వెంట తీసుకొని వెళ్లిపోయారు. నన్ను కార్యాలయానికి రప్పించుకొని పన్ను అధికంగా కట్టాల్సిందిగా లెక్కలు చూపించి ఇబ్బంది పెట్టారు. సక్రమంగా పన్నులు కడుతున్నట్లు చెప్పినా వినిపించుకోకుండా రూ. 50వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. డబ్బులు ఇస్తేనే ట్యాక్స్‌ తగ్గించి రికార్డులు ఇస్తామని చెప్పారు. చాలాసార్లు ఆఫీసుకు వెళ్లి అంత మొత్తం ఇవ్వలేనని వేడుకున్నా వినిపించుకోలేదు. అందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.            – కొత్తకోట ప్రసాద్‌ , బాధితుడు

కావాలనే ఇరికించారు
ఏసీబీ ట్రాప్‌ ఒక పథకం ప్రకారం కావాలనే చేసినట్లుంది. కొత్తకోట ప్రసాద్‌ ఎవరో నాకు తెలియదు. నేను ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. ట్యాక్స్‌ తగ్గించి రాస్తానని నేను చెప్పలేదు. లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మధ్య వ్యాపారుల వద్ద కఠినంగా మాట్లాడి పన్నుల వసూళ్లు చేస్తున్నాం. దీనిని దృష్టిలో పెట్టుకొని కావాలనే ఇలా పథకం ప్రకారం చేశారు. మంగళవారం ఏసీటీవో నాకు ఇచ్చిన రూ. 50వేలు ట్యాక్స్‌ కలెక్షన్‌ అనుకున్నాను తప్ప ఇలా ఏసీబీ ట్రాప్‌లో ఇరికిస్తారని ఊహించలేదు.         – ఎచ్చెర్ల మన్మథరావు, డీసీటీఓ

నిర్ధారణ చేసుకున్నాకే దాడి చేశాం
బాధితుడు కొత్తకోట ప్రసాద్‌నుంచి డీసీటీఓ లం చం డిమాండ్‌ చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీ లన జరిపి నిర్ధారించుకున్న తరువాతే దాడి చేశాం. బాధితుడితో డీసీటీఓ జరిపిన ఫోన్‌ సంభాషణ పరిశీలించి లంచంగా రూ. 50వేలు తీసుకురమ్మని కోరిన తరువాతే బాధితుడి చేత డబ్బులు పంపించాం. బాధితుడు ప్రసాద్‌ రూ. 50వేలు డీసీటీఓ, ఏసీటీఓకు ఇస్తుండగానే పట్టుకున్నాం. నిందితులను ఏసీబీ కోర్టుకు తరలిస్తాం.
– షకీలా భాను, ఏసీబీ డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement