జన్మభూమి కమిటీల అవినీతిమయం | Corruption Done By Tdp Leaders In Nellore | Sakshi
Sakshi News home page

జన్మభూమి కమిటీల అవినీతిమయం

Published Thu, Apr 11 2019 1:16 PM | Last Updated on Thu, Apr 11 2019 1:19 PM

Corruption Done By Tdp Leaders In Nellore - Sakshi

సాక్షి,పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.దోచుకోవడమే పరమావధిగా అధికార పార్టీ పాలన సాగింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేశారు. ఆ పార్టీ నాయకులు ఇసుక అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించారు. దీంతో స్వర్ణముఖి, కాళంగి నదులు రూపు కోల్పోయాయి. ఇళ్లు, పెన్షన్లు, రుణాలు మంజూరు చేసుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులంతా ఐదేళ్లపాటు జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా అర్హులకు ఒక్క పథకాన్ని కూడా అందించిన దాఖల్లాలేవు. 

దోపిడీయే ధ్యేయంగా..
నీరు – చెట్టు పథకం కింద నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. పనులను టీడీపీ నాయకులు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా పనులు పూర్తి చేసి రూ.కోట్లు నిధులు బొక్కేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా రైతు రథాల కింద మంజూరైన ట్రాక్టర్లను అర్హులైన అన్నదాతలకు అందజేయకుండా అధికార పార్టీ నేతలే కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ గృహాలు, పెన్షన్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలు లబ్ధిదారుల వద్ద అధిక మొత్తంలో గుంజుకున్నట్లు విమర్శలున్నాయి.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు పంచాయతీ సర్పంచ్‌లకు నిధులు మంజూరు చేయకుండా రాజ్యాంగా విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. వారు చేసిన అరచకాలతో ప్రజలు బాగా విసిగిపోయారు. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసింది. గడిచిన ఐదేళ్లలో ఒక్కపైసా మాఫీ చేయకపోగా వడ్డీ భారంతో అన్నదాతలు అనేక కష్టాలు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ భారీగా అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఇన్‌చార్జిగా వ్యవహరించిన వారు అధికారులపై ఒత్తిళ్లపై తెచ్చి తమ నాయకులను పనులు చేయించుకున్నారు. 

మున్సిపాలిటీల్లో ఇలా..
సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ప్రజల గురించి అధికార పార్టీ నాయకులు స్పందించలేదు. పలుచోట్ల జరిగిన పనుల్లో అవినీతిని ఏరులై పారించారు. తెలుగుదేశం నాయకులు కాంట్రాక్టర్లుగా మారి రూ.లక్షలు స్వాహా చేశారు. ప్రధానంగా నాయుడుపేట మున్సిపాలిటీలో జరిగిన రోడ్డు, డ్రెయినేజీ పనుల్లో అవినీతి ఎక్కువగా చోటుచేసుకుంది. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సూళ్లూరుపేటలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న తీసుకున్న చర్యలు శూన్యం. 

ప్రజల కోసం ప్రతిపక్షం పోరాటాలు
నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు వాటిపై పోరాటాలు చేస్తూ పరిష్కారానికి తమవంతు కృషి చేశారు. ఐదేళ్లలో వర్షాలు సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మారుమూల గ్రామల ప్రజల దుస్థితిపై ఇక్కడి టీడీపీ నేతలు స్పందించలేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు పలుమార్లు జెడ్పీ సమావేశంలో ప్రజల పక్షాన గళం విప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, లారీలతో చెన్నైకి తరలించడంపై పెళ్లకూరు ఎంపీపీ సత్యనారాయణరెడ్డి కొందరు రైతులతో కలిసి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి  కష్టాలు తప్పవని, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయో ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొని అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే పలుమార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులను సైతం టీడీపీ నేతలు బెదించి వాహనాలను విడిపించిన ఘటన చోటుచేసుకున్నాయి. అధికార పక్ష అవినీతిపై ప్రతిపక్ష నేతలు అనేక సందర్భాల్లో గళం విప్పారు. సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.

తాగు, సాగునీటి విషయంలో అధికారులతో అనేకసార్లు మాట్లాడి వినతులు సమర్పించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రజలపక్షాన గళం విప్పారు. ప్రజల సమస్యలపై చర్చించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వైనంపై బహిరంగ వేదికలపై నిలదీసిన ఘటనలున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ ఒక్కోసారి ఒక్కో స్టాండ్‌ తీసుకున్నా ప్రతిపక్షం మాత్రం మొదటి నుంచి హోదా కోసమే పోరాడింది. ఆ పార్టీ నాయకులు హోదా వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పోరుబాట పట్టారు. ప్రజలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement