సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఆచరణకు సాధ్యమైన హామీలు ఇచ్చి, ప్రతిపక్షంలో తమ పనితీరు చూసే ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళ్లారు. అధికార టీడీపీ మాత్రం ఐదేళ్లు అవినీతికి పాల్పడి ఆ డబ్బు మూటలతో గెలవాలని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగింది. అవినీతి తప్ప అభివృద్ధి చేయలేక, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేక డబ్బుల రాజకీయాలను నమ్ముకుని ఓట్లు కొనే పనిలో ఉంది.
అయితే గత పాలన నేపథ్యంలో జిల్లా ప్రజలు టీడీపీని ఎంత వరకు ఆదరిస్తారో అనే ఆందోళన టీడీపీ అభ్యర్థుల్లో బలంగా ఉంది. అయినా అధినేత మాట తప్పని సరిగా కావడంతో డబ్బు మూటలతో అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. అభ్యర్థుల ప్రకటన మొదలుకొని ప్రచార పర్వం వరకు పూర్తి స్పష్టతతో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుని ముందుకెళ్లింది.ఇక టీడీపీ తడబాట్లు, తప్పటడుగులు అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలై నేటికి కొనసాగుతున్నాయి. దీంతో ఓటర్లు కూడా గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రంను నిశితంగా గమనించి బ్యాలెట్‌తో గురువారం తీర్పు ఇవ్వనున్నారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వివాదరహితుడు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, అందరికీ సుపరిచితుడు బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగారు.
అధికార పార్టీలో వెన్నుపోటు రాజకీయాలే
జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో అధికార పార్టీలో వెన్నుపోటు వ్యవహారాలు, డబ్బు రాజకీయాలు బలంగా సాగుతున్నాయి. నెల్లూరు నగరంలో అయితే పూర్తిగా డబ్బునే నమ్ముకొని మంత్రి నారాయణ అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. నగరంలోని అన్ని డివిజన్లపై డబ్బు మూటలను భారీగా కుమ్మరించారు. అయితే గడిచిన ఐదేళ్లలో నారాయణ నెల్లూరు నగరంలో ఎన్ని రోజులు ఉన్నారు. ఏం చేశారు. అధికార పార్టీ నేతల తీరు ఎలా ఉందనే చర్చ సాగుతున్న క్రమంలో అంతర్గత వెన్నుపోట్లతో పూర్తి నష్టం కలుగుతుందనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలో ఉన్న అజీజ్ నగర మేయర్‌గా ఐదేళ్లు పాటు పనిచేసినా పూర్తి డమ్మీగానే మిగిలిపోయారు.
మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. దీనికి తోడు ఆయన స్టార్ కంపెనీ కేసులు ఇబ్బందులతో నేటికీ సతమతం అవుతున్నారు. ఇక సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో వందల రూ.కోట్లు దండుకున్నారు. చేయని పనులు, మంజూరు కానీ పనులకు కూడా ముందుగానే భారీగా వసూళ్లు చేయడం అయనకే చెల్లింది. కావలిలో బరిలో నిలిచిన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పూర్తిగా పరాన్నజీవిగా మారారు.
బీద సోదరుల కనుసన్నల్లో పని చేస్తున్నారు. చివరి నిమిషంలో పార్టీలోకి జంప్ అయి టికెట్ దక్కించుకున్న కాటంరెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కోవూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రోడ్డు మొదలుకొని భూములు వరకు దేనిని వదలకుండా భారీగా స్వాహా చేశారు. ఇక్కడ ప్రతి ప్రభుత్వ పథకం పార్టీ క్యాడర్ కంటే ఆయనకు వరంలా మారి భారీగా దండుకున్నారు. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి బొల్లినేని రామారావు ఉదయగిరి కంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నారు.
ఉదయగిరిలో చేసిన పనుల్లో భారీగా అవినీతి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో పనులకు సంబధించిన కేసులు కూడా నమోదు కావడంతో గందరగోళం కొనసాగుతుంది. ఇక ఆత్మకూరు అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే బడా పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్యకు అధికార పార్టీ నేతల నుంచే వెన్నుపోట్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మూడు నెలల ముందు వచ్చి డబ్బు మూటలతో గెలవాలని ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థిగా ఉన్న పాశం సునీల్‌కుమార్ లెక్కకు మించి అవినీతికి పాల్పడిన విషయం జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సూళ్లూరుపేటలో పరసారత్నంకు నామినేషన్ నుంచి మొదలైన గందరగోళం నేటికి కొనసాగుతుంది. స్థానికుల నేతల వెన్నుపోట్లతో పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి. వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కురుగుండ్ల రామకృష్ణ అయితే కాంట్రాక్టర్లను బెదిరించడం మొదలుకొని అన్ని పనులు భారీగా చేయటంతో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment