గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానిక ఉపకోశాధికారి(సబ్ ట్రెజరీ) కార్యాలయం లో వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉపాధ్యాయులకు విడుదలైన డీఏ (డ్రాట్ అలనెన్స్) బిల్లుల విషయంలో ఈ తతంగానికి తెరతీసినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరు నెలల క్రితం డీఏ(కరువు భత్యం)ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులోభాగంగా 2003 డీఎస్సీ వారికి రూ. 38 వేలు, 2006 డీఎస్సీ ఉపాధ్యాయులకు రూ.19 వేల వరకు కరువుభత్యం రానుంది.
ఈ జీఓ ద్వారా గజ్వేల్ తాలుకా పరిధిలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 500 మందికిపైగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వీరంతా గజ్వేల్‌లోని ఎస్టీఓ కార్యాలయంలో బిల్లులు చేయించుకుని డీఏ పొందాల్సి ఉంది. దీంతో ఇదే అదునుగా భావించిన సంబంధిత కార్యాలయ అధికారులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు తెలిసింది. ఒక్కో ఉపాధ్యాయుని వద్ద రూ. 800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలోని ఓ అధికారి కనుసన్నల్లో ఈ తతంగం నడస్తున్నట్లు సమాచారం. డబ్బులిస్తేనే బిల్లులు చేస్తామని ఉపాధ్యాయులను వేధించిన క్రమంలో కొన్ని రోజుల కిందట ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు కార్యాలయంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి సైతం దిగారు. ఆ తర్వాత వసూళ్లకు కాస్త బ్రేక్ వేసిన అధికారులు మళ్లీ తమ దందా కొనసాగించారని టీచర్లు చెబుతున్నారు.
లంచమిస్తేనే బిల్లు చేస్తారంట
చాలా రోజుల తర్వాత మాకు ప్రభుత్వం డీఏ మంజూరు చేసింది. ఈ జీవో రాగానే ఎంతో సంబరపడ్డాం. కానీ లంచమిస్తేనే బిల్లులు చేస్తామని ఎస్టీఓ కార్యాలయంలో అధికారులు వేధిస్తున్నారు. డబ్బులివ్వపోతే బిల్లులు చేయడం లేదు.
-న్యూస్‌లైన్‌తో ఓ ఉపాధ్యాయుడి ఆవేదన
ఆరోపణలు అవాస్తవం
ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బిల్లుల విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణల్లో నిజం లేదు. ఏ ఒక్క ఉపాధ్యాయున్ని కూడా ఇబ్బంది పెట్టకుండా బిల్లులు చేయించి పంపుతున్నాం. కార్యాలయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లు భావిస్తే ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురావాలి.
- రవీందర్‌రెడ్డి, ఉపకోశాధికారి, గజ్వేల్
వసూల్ రాజాలు!
Published Tue, Nov 12 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement