సాక్షి ప్రతినిధి, అనంతపురం :
నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన ‘వ్యవసాయ మిషన్’ను కరువు జిల్లాలో ప్రకటించనున్నారు. ఆగస్టు ఏడున విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో తన ప్రభుత్వ ప్రాధాన్యతలను ‘ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు’గా చంద్రబాబు వివరించారు. అందులో ప్రాధాన్యతా రంగ అభివృద్ధి కింద ‘వ్యవసాయ మిషన్’ను ప్రకటించనున్నారు. కలెక్టర్ల సమావేశంలోనే ముఖ్యమంత్రి ‘వ్యవసాయ మిషన్’ రూపురేఖలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ‘వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచాలి.
వరి, అరటి లాంటి పంటల ఉత్పత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. పశుపోషణ, పాడి, పౌల్ట్రీ లాంటి అనుబంధ రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. భూగర్భజలాల పెంపు, నీటివనరుల సంరక్షణపై మరింత కేంద్రీకరించాలి’ అంటూ పేర్కొన్నారు. దీన్నిబట్టి ‘వ్యవసాయ మిషన్’ ఉత్పాదకత పెరుగుదల చుట్టూనే తిరుగుతోందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది వ్యవసాయ రంగమా లేక రైతాంగమా అన్న మౌలిక ప్రశ్నను రైతు సంఘాల ప్రతినిధులు లేవనెత్తుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక 1950లో సగటున కోటి జనాభాకు పది లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 30 మందికి లీటరు పాల ఉత్పత్తి మాత్రమే ఉండేది. అయినా ఆ కాలంలో రైతు ఇప్పుడున్నంత సంక్షోభంలో లేడు.
హరిత విప్లవం నేపథ్యంలో ప్రస్తుతం సగటున కోటి జనాభాకు 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాం. పది మందికి లీటరు చొప్పున పాల ఉత్పత్తి చేస్తున్నాం. దేశ జనాభా 3.5 రెట్లు పెరగ్గా.. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏడు రెట్లు అధికమైంది. పాల ఉత్పత్తి పది రెట్లు, అక్వా రంగ ఉత్పత్తులు 12 రెట్లు పెరిగాయి. వ్యవసాయోత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా.. అది రైతుల జీవితాల్లో ప్రతిఫలించక పోవడమే ప్రస్తుత విషాదం. ఇందుకు ప్రధాన కారణం ఉత్పత్తి పెరిగినప్పటికీ గిట్టుబాటు ధర లభించకపోవడమే. అర శతాబ్ద కాలంగా వ్యవసాయానికి సంబంధించిన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ రైతుల జీవితాల్లో మాత్రం సంక్షోభం పెరుగుతూనే వస్తోంది. దీని పర్యవసానమే ఏటా వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు అని విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు ప్రకటించనున్న ‘వ్యవసాయ మిషన్’లో ఈ ప్రధాన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని రైతుసంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. రైతుకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేయడమన్న అంశాన్ని ఇరుసుగా చేసుకుని ‘వ్యవసాయ మిషన్’ను ప్రతిపాదించాల్సిన అవసరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంక్షోభం ఇలా :
మన రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న పంట వరి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే క్వింటాలు ధాన్యం పండించేందుకు రైతుకు అవుతున్న ఖర్చు రూ.1,675. అయితే.. క్వింటాల్ ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,310 మాత్రమే. అంటే రైతు ప్రతి క్వింటాలుకు రూ.365 నష్టపోతున్నాడు. ఇక ప్రకృతి విపత్తులు, సమయానికి సాగునీరు అందకపోవడం లాంటి సందర్భాల్లో నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి. క్వింటాల్ పత్తి ఉత్పత్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.5,950. ప్రభుత్వ మద్దతు ధర మాత్రం రూ.4 వేలు. వ్యాపారుల మాయాజాలం కారణంగా కనీస మద్దతు ధర కూడా రైతుకు లభించని పరిస్థితులున్నాయి. మిగతా అన్ని పంటల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతు పంటలు పండిస్తున్నా ‘మార్కెట్’ ముందు అచేతనుడిగా మిగిలిపోతున్నాడు. గిట్టుబాటు కాని వ్యవసాయం కారణంగానే అప్పుల ఊబిలోకి కూరుకు పోయిన రైతు ఆత్మహత్యల బాట పడుతున్నాడు. వ్యవసాయోత్పత్తులు పెంచడంతో పాటు ‘గిట్టుబాటు’ ధర కల్పించినప్పుడే ‘వ్యవసాయ మిషన్’కు సార్థకత ఉంటుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ‘పంటల దిగుబడిని బట్టి కాకుండా, ఎకరానికి రైతు ఆర్జించిన నికర ఆదాయాన్ని బట్టే వ్యవసాయాభివృద్ధిని లెక్కించాలి’ అన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలను ఈ సందర్భంగా పలువురు రైతుసంఘాల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు.
పంట పొలాల్లో ప్రాజెక్టులు వద్దు
చంద్రబాబు ‘వ్యవసాయ మిషన్’లో భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వల సద్వినియోగం కూడా ఓ ప్రధానాంశం. ముఖ్యమంత్రి ‘వ్యవసాయ మిషన్’ను ప్రకటించేందుకు అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురాన్నే వేదిక చేసుకున్న సందర్భంగా ఇక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములను పారిశ్రామిక అవసరాలకు కేటాయించడంపై జిల్లా వాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో పుష్కలంగా భూగర్భ జలాలున్న రెండు, మూడు ప్రాంతాల్లో నంబులపూలకుంట ఒకటి. ఇక్కడా దాదాపు ఐదు వేల ఎకరాల్లో ‘సోలార్’ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు కేటాయించిన భూమికి ఒకవైపు వెలిగల్లు, మరోవైపు పెడబల్లి రిజర్వాయర్లు ఉన్నాయి.
పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్న ఈ భూమిని వ్యవసాయాభివృద్ధికే కేటాయించాలన్న డిమాండ్‌పై సీఎం సానుకూలంగా స్పందిస్తే ఆయన ప్రకటించే ‘వ్యవసాయ మిషన్’పై జిల్లా వాసుల్లో కొంతైనా నమ్మకం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే హంద్రీ-నీవాను సత్వరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని, హెచ్‌ఎల్‌సీ నుంచి పూర్తి నీటివాటా పొందేందుకు సమాంతర కాలువ నిర్మాణానికి చొరవ చూపాలన్న చిరకాల డిమాండ్లపైనా సీఎం స్పందనకోసం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతులు కూడా పొందిన ‘ప్రాజెక్టు అనంత’ను అమల్లోకి తెచ్చి జిల్లా ఎడారి కాకుండా కాపాడినప్పుడే చంద్రబాబు ‘వ్యవసాయ మిషన్’కు సార్థకత చేకూరుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
వ్యవసాయ మిషన్‌లో రైతుకు చోటుందా?
Published Mon, Oct 6 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement