ఒక రాజకీయ పార్టీలోకి చేరనందుకు అనంతపురంలోని ముగ్గురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు అంటూ ఇంటి నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
అనంతపురం క్రైం, :ఒక రాజకీయ పార్టీలోకి చేరనందుకు అనంతపురంలోని ముగ్గురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు అంటూ ఇంటి నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
అనంతరం స్టేషన్‌లో కళ్లకు గంతలు కట్టి పాశవికంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పీసీసీ కార్యదర్శి వజ్జల మల్లికార్జున అలియాస్ పాల మల్లి, అతని బావమరిది మాజీ కార్పొరేటర్ మురళి, కార్యకర్త విజయకుమార్ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను మురళితో కలిసి పాలమల్లి వివరించారు.
‘‘మాపై ఎలాంటి రౌడీషీట్లూ లేవు. ఏ చిన్న కేసుల్లోనూ జోక్యం చేసుకోలేదు. అలాంటి మమ్మల్ని ఓ సీఐ పోలీస్‌స్టేషన్‌కు రావాలని పలుమార్లు పిలిచాడు. రౌడీషీట్ ఉందని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు. ఆయన వేధింపులు తాళలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. ఆ అధికారికి న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఒక నేత మరొక పార్టీలోకి చేరబోతున్నాడు. తమను కూడా ఆహ్వానిస్తే నిరాకరించాం.
దీంతో సీఐని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బెదిరించేందుకు కుట్రపన్నాడు. అందులో భాగంగానే పోలీసులను ఉసిగొలిపాడు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు వేణుగోపాల్‌నగర్‌లోని మా ఇంటికి వచ్చిన సీఐ ‘రేయ్ స్టేషన్‌కు రారా’ అని పిలిచాడు. ఎందుకని ప్రశ్నిస్తే నేను రమ్మన్నపుడు రాలేదు కదా..? ఈ రోజు కొట్టుకుంటూ తీసుకెళతా? అంటూ లాఠీలతో చితకబాదాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయారు. స్టేషన్‌లోకి వెళ్లాక కళ్లకు గంతలు కట్టి.. ‘కాంగ్రెస్‌లో ఎంతకాలం ఉంటావురా? వేరే దారి చూసుకోవా?’ అంటూ పాశవికంగా కుళ్లబొడిచారు. నాపై రౌడీషీట్ ఎత్తివేసినప్పటి నుంచి శాంతియుతంగా బతుకుతున్నాను.
సీఐ ఏమో రౌడీషీట్ ఉందంటూ చావకొట్టారు. ఓ రాజకీయ పార్టీ మద్దతుదారుడైన సీఐ ఆ పార్టీ నేతల సూచనల మేరకే తమపై ప్రతాపం చూపుతున్నాడు. సీఐతోపాటు ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్‌పై ప్రైవేట్ కేసు వేయడంతోపాటు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.
ఫోన్‌లో ఎంపీ పరామర్శ
పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన బాధితులు పాలమల్లి, మురళి, విజయ్‌కుమార్‌లను అనంతపురం ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. పోలీసులతో మాట్లాడుతానని చెప్పినట్లు తెలిసింది.
ఇదేం న్యాయం?: జేసీ బ్రదర్స్
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు లాఠీలతో కుళ్లబొడవడాన్ని ఖండించారు. పొలిటికల్ ఒత్తిడితో అమాయకులను చితకబాదడం కరెక్టు కాదన్నారు. రౌడీషీటర్లు అయినంత మాత్రాన ఆస్పత్రి పాలయ్యేలా కొడతారా? అంటూ ప్రశ్నించారు.