రమేష్‌ కుమార్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు | Counter Petition Filed By AP Government On Nimmagadda Ramesh Petition | Sakshi
Sakshi News home page

మాజీ ఈసీ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు

Published Sat, Apr 18 2020 6:45 PM | Last Updated on Sat, Apr 18 2020 7:26 PM

Counter Petition Filed By AP Government On Nimmagadda Ramesh Petition - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. రమేష్‌ కుమార్‌ పిటిషన్‌లో ప్రభుత్వంపై తప్పుడు అభియోగాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. తనను తొలగించడానికే ఆర్డినెన్స్‌ తొలగించారన్న మాజీ ఈసీ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి ద్వివేదీ 24 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ చేసిన ఆరోపణలేవీ సరైనవి కావని వివరించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణ చేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని హైకోర్టుకు విన్నివించారు. (రాజ్యాంగ బద్ధంగానే మూడేళ్లకు కుదింపు)

అలాగే ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ‘ఈసీ పదవీ కాలం తగ్గింపు, పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులను గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తెచ్చాం. గవర్నర్ నిర్ణయం అనంతరం ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్ధాయిలో ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. 2000 సంవత్సరం తర్వాత అధికారులతో నిర్వహించిన ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందే. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు రమేష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరింది. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని ఈసీ ప్రకటించడం సరికాదు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. (రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి)

దీనితో పాటు ఒడిషా, మహారాష్ట్ర, బెంగాల్లో స్ధానిక ఎన్నికల వాయిదా పరిస్ధితులను ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఏపీ స్ధానిక ఎన్నికల వాయిదాతో మిగతా రాష్ట్రాలకు ఎలాంటి పోలికలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది.  కాగా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం దానిపై కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపై త్వరలోనే న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement