రూ.లక్షకు 3 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బొబ్బిలి పోలీసులు శనివారం
బొబ్బిలి రూరల్: రూ.లక్షకు 3 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బొబ్బిలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ టి.సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన గొర్లె హేమచందర్, చుక్క శ్యాంకుమార్‌లు బొబ్బిలికి చెందిన రవి అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల పేరిట మోసానికి పాల్పడేందుకు కారులో వచ్చారు.
వీరు ఓ డబ్బాలో పైన నాలుగు ఒరిజినల్ నోట్లను పెట్టి డబ్బా లోపల ఉన్న నోట్ల కట్టల్లో పైన అసలు నోటు ఉంచి మధ్యలో న్యూస్‌పేపర్ ముక్కలు పెట్టి మోసం చేస్తున్నారు. లక్ష రూపాయలకు మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న వీరు తొలుత బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో బొబ్బిలికి చెందిన రవిని కలుద్దామనుకున్నారు. అయితే ఎవరికైనా అనుమానం వస్తుందనే కారణంతో రవి మానాపురంలో కలుద్దామని ఓసారి, గజపతి నగరంలో కలుద్దామని మరోసారి హేమచందర్, శ్యామ్‌కుమార్‌లకు తెలిపాడు.
వీరు గ్రోత్ సెంటర్ నుంచి పరారయ్యేందుకు యత్నిస్తుండగా ఎస్‌ఐ నాయుడు, ఐడీ పార్టీ సిబ్బంది రమణ, మురళి, లక్ష్మణ్, వెంకటేష్‌లు వెంటాడి బొండపల్లి వద్ద పట్టుకున్నారు. వీరు గత రెండేళ్లుగా విజయనగరానికి చెందిన శివ, రాజు, గజపతినగరంకు చెందిన శ్రీనివాస్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. బొబ్బిలికి చెందిన రవి ఫోన్ నంబర్ లభించిందని, అతను ఎవరనేది విచారిస్తున్నామని సీఐ తెలిపారు. విలేక రుల సమావేశంలో ఎస్‌ఐ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.