ఇంటికప్పు కూలి దంపతుల దుర్మరణం
సిద్దవటం: వివాహబంధంతో ఒక్కటైన వారు మరణంలోనూ ఒక్కటై వెళ్లిపోయారు. సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున నివాస గృహం పైకప్పు(స్లాబు) కూలి ఎన్నంరెడ్డి సుబ్బారెడ్డి(65), భాగ్యమ్మ(58) అనే దంపతులు దుర్మరణం చెందారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీగా భాగ్యమ్మ పని చేస్తోంది. ఈమె భర్త సుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకునేవారు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పైకప్పు స్లాబు విరిగి నిద్రిస్తున్న వారిపై కూలింది.
దీంతో సుబ్బారెడ్డి శిధిలాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను చికిత్స నిమిత్తం 108వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటికే భాగ్యమ్మ కూడా కన్నుమూసింది. రోజూ తెల్లవారుజామున 4గంటలకే నిద్రలేచే వారని, వర్షం కురుస్తుండటంతో సోమవారం నిద్రలేవలేదని, ఇంతలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్‌ఐ అన్సర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం కోసం సుబ్బారెడ్డి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు రిమ్స్‌లో మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.