సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు.
ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.
అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే మారిన సీన్ !
ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్‌చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం.
వాడీవేడిగా విమర్శలు !
మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment