ఉమ్మడి పశ్చిమలో టీడీపీ, జనసేన, బీజేపీ తలోదారి
ఉండిలో రామరాజుకు హ్యాండిచ్చిన బాబు
రఘురామకృష్ణరాజుకు సీటు అనడంతో భగ్గుమన్న కేడర్
దెందులూరులో టీడీపీ నేత అశోక్‌గౌడ్ రాజీనామా
స్వతంత్రంగా బరిలో దిగేందుకు తపన చౌదరి సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఏలూరు ఎంపీ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ నేత తపన చౌదరి హడావుడి చేస్తుండగా.. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. కూటమిలో కీలక నేతలుగా ఉన్నవారు రాజీనామాల బాట పట్టి అధికార వైఎస్సార్‌సీపీలో చేరుతుండటంతో కూటమి రాజకీయాల్లో తీవ్ర గందరగోళం రేగింది.
ఉండిలో రామరాజుకు షాక్
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. శనివారం ఉదయం పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతా టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామరాజు వర్గానికి సర్ధిచెప్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా జనసేనకు కేటాయించిన నర్సాపురం అసెంబ్లీ సీటులో చంద్రబాబునాయుడు సభ నిర్వహించడంపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.
ఏలూరు పార్లమెంట్‌లో వరుస షాక్‌లు
ఏలూరు పార్లమెంట్‌లో కూటమి పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దెందులూరు నియోజకవర్గ టీడీపీ సీటు ఆశించి భంగపడిన అశోక్‌గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అశోక్‌గౌడ్‌కు బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటంతో పాటు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు.
తపన చౌదరి బల ప్రదర్శన
ఏలూరు పార్లమెంట్ బీజేపీ నేత తపన చౌదరి బలప్రదర్శనకు దిగారు. పోలవరం నుంచి కై కలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీకి వెనక్కి తగ్గేది లేదని టీడీపీ కుట్ర రాజకీయాలకు బీజేపీని బలి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ నుంచి పోటీ తప్పనిసరిగా చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment