సాక్షి, విజయవాడ : లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఒక సర్కులర్ జారీ చేసినట్లు కోవిడ్ స్టేట్ కో-ఆర్డినేటర్ కృష్ణ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉన్నా వలస కూలీలు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. మన రాష్ట్రానికి సంబంధం లేకున్నా మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రైన్‌లు, బస్సుల్లో వారిని స్వంత రాష్ట్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో సర్కులర్ కూడా జారీ చేశామన్నారు. గత 3 రోజులుగా నడిచి వెళ్ళే 4661 మందిని రిలీఫ్ సెంటర్స్‌కి పంపామన్నారు.
ప్రతి చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశామని, ఒడిశాకు సంబంధించిన వారిని బస్సుల ద్వారా గంజాం జిల్లాకు తరలిస్తున్నామని వెల్లడించారు. కాగా ప్రతీ రైలులో వలస కూలీలకు మూడు బోగీలు వీరికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు డీజీ తో చర్చించాక అక్కడ నుండి నడిచి వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింపోయిందన్నారు. తెలంగాణ నుంచి వలస కార్మికులు నడిచి వస్తూనే ఉన్నారన్నారు. ఈ రోజు ఒడిశాకు చెందిన మరో వెయ్యి మందిని వారి స్వస్థలలాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఏపీ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు వివిధ రాష్ట్రాలకు బయలుదేరుతున్నాయి. నాలుగు, ఐదు రోజుల్లో నడిచి వెళ్ళే వారిని ఈ శ్రామిక్ రైళ్లలో తరలిస్తామన్నారు. వలస కార్మికులపై దౌర్జన్యం, లాఠీ ఛార్జ్ లాంటివి చేయొద్దని సీఎం ఆదేశించారని కృష్ణబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment