కోటి కుంటలు తవ్వినా సీమ కరువు పోతుందా? | cpi fires on chandra babu naidu | Sakshi
Sakshi News home page

కోటి కుంటలు తవ్వినా సీమ కరువు పోతుందా?

Published Wed, Dec 30 2015 7:57 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

cpi fires on chandra babu naidu

విజయవాడ: రాయలసీమను కరువు రహితంగా చేసేందుకు నీటి కుంటలు తవ్వుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. కోటి కుంటలు తవ్వినా సీమ కరువు పోతుందా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు నీటి కుంటలంటూ కొత్తరాగం ఆలపిస్తున్నారని, ఇదంతా తెలుగు తమ్ముళ్ల ఉపాధి కోసమేనని విమర్శించారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 650మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుంటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం మానవత్వం చూపడంలేదన్నారు. అనేక అవస్థలు పడి 13రకాల ధృవపత్రాలు ఇస్తేనే పరిహారం అందిస్తున్నారని దుయ్యబట్టారు. తన నివాసానికి రోడ్డుకే రూ.70కోట్లతో ఖర్చుపెట్టిన బాబు కరువు ప్రాంతంలో ఒక జిల్లా మొత్తానికి కేంద్రం రూ.50కోట్లు మాత్రమే ఇస్తే ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

రాయలసీమలో కరువు పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా వామపక్షపార్టీలు ఈ నెల 5న విజయవాడలో కీలక సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ర్టంలో లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగాల భర్తీ వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 8, 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్న సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శి గురుదాస్‌గుప్త, పార్లమెంటరీ పార్టీ నాయకుడు డి.రాజా పాల్గొంటారని చెప్పారు. జనవరి 8న సీపీఐ ఆవిర్బావ దినోత్సవ వేడుకల ముగింపును గుంటూరులో భారీ ప్రదర్శన, బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement