ప్రజా కోర్టులో మోదీని శిక్షించాలి
తిరుపతి (అలిపిరి) : ఆర్థిక ఎమర్జెన్సీకి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని, ప్రజా కోర్టులో ఆయనను శిక్షించాలని సీపీఐ జాతీ య కార్యదర్శి నారాయణ అన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా ఆయన మంగళవారం కార్యకర్తలతో కలిసి తిరుపతిలోని ఎస్‌బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేసి, సామాన్యులను కష్టాల పాలు చేసిన మోదీ శిక్షార్హుడని అన్నారు. కరెన్సీ కష్టాలతో 50 మందికిపైగా మృత్యువాతపడినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మోదీ తక్షణం పదవికి రాజీనామా చేసి వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన ఆర్బీఐ గవర్నర్ ప్రజా అవసరాల దృష్ట్యా రూ.50, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నారాయణ అరెస్ట్‌తో ఉద్రిక్తత..
ఎస్‌బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా అనంతరం సీపీఐ నారాయణ కార్యకర్తలతో కలిసి అక్కడున్న ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని నారాయణతో పాటు పార్టీ జిల్లా నాయకులను అరెస్ట్ చేసి, వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు.
ఆగ్రహించిన కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు. వారిని తోసుకుంటూ పోలీసులు నారాయణను ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకయ్య, జయమ్మ, పెంచులయ్య, రవి, రాధాకృష్ణ, చంద్రశేఖర్ నాయుడు, శివారెడ్డి, సత్తి, కత్తి రవి ఉన్నారు.