
'చంద్రబాబుది దగాకోరు ప్రభుత్వం'
అనంతపురం : పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం సీపీఐ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మని దహనం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు. సీపీఐ నగర కమిటీ మంగళవారం అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని దుమ్మెత్తి పోశారు.
పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్‌చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు చార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధపడడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు మోసపోయామని ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారన్నారని, ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని సీపీఐ పేర్కొంది. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాలపెద్దన్న, అల్లీపీరా, కార్పొరేటర్ పద్మావతి, బాషా, ఎల్లుట్ల నారాయణస్వామి, పెనకచర్ల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.