వాళ్లిద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమా?
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుకూలంగా మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ మెడికల్ కౌన్సిలింగ్ లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మెడికల్ కౌన్సిలింగ్ పై ఈనెల 26న హెల్త్ యూనివర్శిటీకి వెళతామని, ఆరోజు మంత్రి కామినేని కూడా యునివర్శిటికి వస్తే వాస్తవాలను వెల్లడిస్తామని అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణ సవాల్ చేశారు. చట్టం గురించి పార్లమెంటు లో ఎవరికి తెలియదని అంటున్న వెంకయ్య నాయుడుకి చట్టం తెలిస్తే ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజికి చట్టబద్దత ఉందా అనే విషయంలో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.