తుందుర్రులో కదం తొక్కిన ప్రజలు
ఆక్వా పార్క్ ఏర్పాటుపై వ్యతిరేకత
200 మంది ఆందోళనకారుల అరెస్ట్
పరిసర గ్రామాల్లో 144 సెక్షన్
నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం మండలాల మధ్య గల తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటిని ధిక్కరించి ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పరిసర గ్రామాల్లో 144 సెక్షన్..
ప్రజల ఆందోళనతో తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందితో గ్రామం నిండిపోయింది. ప్రధాన రహదారులపై బారీకేడ్లు, తనిఖీలతో పోలీసులు ఉదయం నుంచి ఎవరినీ బయటి గ్రామాల నుంచి రాకుండా నియంత్రించారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్దఎత్తున పోలీసు బలగాల పహారా ఉండగానే సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు, మహిళలు పార్క్ నిర్మాణం ఏర్పాటుపై తమ వ్యతిరేకతను నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నర్సాపురం రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు.
అరెస్టయిన ఉద్యమకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు.