
పిఠాపురం టౌన్: తెలుగుదేశం అవినీతి పాలనతో రాష్ట్రం అతలాకుతలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. శనివారం సాయంత్రం సీపీఎం 22వ జిల్లా మహాసభ స్థానిక ఉప్పాడ సెంటర్‌లో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బి.జె.పి, టి.డి.పి. విధానాలపై ఆయన విరుచుకు పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీరని నష్టం కల్గిస్తున్నారన్నారు. మట్టి, ఇసుక, మద్యం, మాఫియా రాష్ట్రంలో పెట్రేగిపోతోందన్నారు.
జిల్లాలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. సెజ్ రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చారని పిఠాపురం నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ మద్యం విధానంతో చంద్రబాబు మహిళలను ఆందోళనకు, ఆవేదనకు గురిచేస్తున్నారన్నారు. పార్టీ నాయకులు దడాల సుబ్బారావు, దువ్వా శేషు బాబ్జీలు మాట్లాడుతూ దేవదాయ భూములను టిడిపి నేతలను కాజేస్తున్నారన్నారు. రెండ్రోజులు పాటు జరిగే పార్టీ జిల్లా మహాసభల్లో ప్రజా సమస్యలపై ఉద్యమాలకు కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సభలో పార్టీ నాయకులు జి.బేబీరాణి, జి.అప్పారెడ్డి, కూరాకుల సింహాచలం తదితరులు మాట్లాడారు.
పట్టణంలో భారీ ర్యాలీ...
సీపీఎం 22వ మహాసభలు పురస్కరించుకుని శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎర్ర జెండా రెపరెపలాడింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ సెంటర్, కోటగుమ్మం మీదుగా ఉప్పాడ సెంటర్‌కు చేరుకుంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్మికులు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు ప్రదర్శించారు. జాతీయ నాయకుల వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. బహిరంగ సభలో ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సుందరయ్య జీవిత చరిత్ర మీద ప్రదర్శించిన కథనంతో జానపద కళారూపాన్ని ప్రదర్శించారు.
జగన్ పాదయాత్రతో సమస్యలు తెలుసుకోవడం హర్షణీయం...
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం హర్షణీయమని రాష్ట్ర సీపీఎం పార్టీ కార్యదర్శి పి.మధు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైఖరి వెల్లడించాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భీమవరంలో నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రజల సమస్యలపై విశాల వేదిక ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని పవన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు.