
సీపీఎం నేతలది అవకాశవాదం: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీపీఎంపైనా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుపైనా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విరుచుకుపడ్డారు. సీపీఎం నేతలు పచ్చి అవకాశవాదంతో సీపీఐపై మాటలు తూలుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు తామొక్కళ్లమే మొనగాళ్లు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సన్నాయి నొక్కులు, కోస్తాంధ్రలో సింహగర్జనలు చేసే సీపీఎం గురించి పార్టీలు, ప్రజలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. అన్ని పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తెలంగాణకు మద్దతు పలికినట్టు వివరించారు. ‘తెలంగాణలో ఉద్యమం జరిగినంత కాలం మౌనంగా ఉండి పర్యటనలు పరి మితం చేసుకోలేదా? 2013 జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడ్డాక సీమాంధ్ర ప్రాంతాల్లో హడావుడి పర్యటనలు చేస్తూ సమైక్యతకు తామే మొనగాళ్లమని ప్రకటించుకుంటూ సీపీఐ పైన, ఇతర ప్రజాసంఘాలపైనా విషం కక్కే ప్రసంగాలు చేస్తారా?’ అని ధ్వజమెత్తారు.