
నారాయణ విలువ 15 కోట్లేనా?
సీపీఎం నేత రాఘవులు ఎద్దేవా
హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సీపీఎంపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తిప్పికొట్టారు. అసందర్భ, నిరాధార ఆరోపణలు మానాలని హితవు పలికారు. నారాయణకు ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్లాలని, లేదా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్న తమ జాతీయ విధానానికి అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, జేఏస్పీ, మహాజన సోషలిస్టు పార్టీలకు మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. ఖమ్మంలో తమ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం డబ్బులకు అమ్ముడుపోయారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. సీపీఐ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తోందన్నారు.
ఎన్నికలకు సంబంధించి సీపీఎం, సీపీఐల మధ్య ఎటువంటి పొత్తు లేదని రాఘవులు స్పష్టం చేశారు. తమ పార్టీ పోటీ చేసిన 13 స్థానాల్లో సీపీఐ తన అభ్యర్ధులను బరిలోకి దింపిన విషయం నారాయణకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. నారాయణ మాదిరిగా చౌకబారు విమర్శలు చేసి ప్రజలకు వినోదాన్ని పంచాలనుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. నారాయణ విలువ 15 కోట్లేనా? అని ఎద్దేవా చేస్తూ సుమారు 150 కోట్లన్నా ఉంటుందనుకుంటున్నానని చమత్కరించారు. కాంగ్రెస్‌తో జత కట్టినందుకు సీపీఐని ఓడించమని వందసార్లయినా చెబుతామన్నారు.