విశాఖపట్నం : ఎస్సీ, ఎస్టీలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు గిట్టదని, వారిపట్ల కుల వివక్షకు పాల్పడుతుంటారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. దళిత, గిరిజనులంటే సీఎం కుల వివక్ష, పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సమ్మె చేస్తున్నవారిలో ఎక్కువ శాతం మంది దళిత, గిరిజనులు అయినందునే సమ్మె విరమణకు సీఎం ఏమాత్రం ప్రయత్నించట్లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు రూపాయి జీతం చెల్లించడమంటే చంద్రబాబు తెగ బాధపడిపోతారన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
పుష్కరాల పేరుతో రాజమండ్రిలో ఉండి, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు ఖాళీ లేదనడం చంద్రబాబు పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. బిజీగా ఉండుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపి సమ్మెను విరమించే ప్రయత్నం చేయొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశం లేదని అన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని, రాజకీయపార్టీలన్నింటినీ కలుపుకుని రాష్ట్ర బంద్ చేపడతామని స్పష్టం చేశారు. పుష్కరాల్లో దుర్ఘటన పాపం చంద్రబాబు, ఆయన మంత్రివర్గానిదేనని, ఇందుకు వారు బాధ్యత వహించాలని రాఘవులు అన్నారు.
ఎస్సీ, ఎస్టీలంటే బాబుకు గిట్టదు : రాఘవులు
Published Mon, Jul 20 2015 8:25 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement