
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): ఐఎంఎల్ డిపో కార్మికుడు, దళితుడైన రాచీటి జాన్‌ను కొట్టి కులం పేరుతో దూషించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, హత్యాయత్నం కింద తక్షణం అరెస్టు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఏలూరు సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశంలో ఈమేరకు తీర్మానించారు. తనకు సంబంధం లేని కార్మికుల వివాదంలో జోక్యం చేసుకుని తన ఇంటికి పిలిపించి, దౌర్జన్యంగా కొట్టి, కింద పడేసి కాళ్లతో తన్ని , కులం గురించి హేళనగా మాట్లాడి అగ్రకుల అహంకారంతో వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్‌ను కఠినంగా శిక్షించాలని సమావేశం డిమాండ్ చేసింది. దీనిపై గురువారం కలెక్టర్, ఎస్సీని కలిసి చర్చించాలని, 16 లోపు చింతమనేనిపై చర్య తీసుకోకపోతే 17న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
సమావేశంలో బాధితుడు జాన్ మాట్లాడుతూ తనను బండబూతులు తిట్టి, కింద పడేసి దొర్లించి మరీ కొట్టిన చింతమనేని, అతని గన్‌మెన్‌లు ముగ్గురిపైన, చింతమనేని అనుచరులు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావు, చుక్కా ఈశ్వరరావులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. చింతమనేని సాగిస్తున్న అరాచకాలను, దౌర్జన్యాలను సమావేశంలో ఖండించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తదితరులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన సఫాయి కర్మచారీస్ నేషనల్ కమిషన్ సభ్యుడు జగదీష్ హిర్మానీని కలెక్టరేట్‌లో కలిసి వినతి పత్రం సమర్పించారు. సామాజిక న్యాయం చేయాలంటూ ఆయన్ను కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు, కాంగ్రెస్ నాయకుడు రాజనాల రామ్మోహన్‌రావు, వైఎస్సారసీపీ ఎస్సీ సెల్ నాయకుడు మున్నుల జాన్‌గురునా«థ్, జనసేన నాయకులు మత్తే బాబి, ఎమ్మార్పీఎస్ నాయకులు పలివెల చంటి తదితరులు, ఐఎఫ్‌టీయూ నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీపీఎం నాయకుడు గుడిపాటి నరసింహరావు, సిఐటీయూ నాయకులు బి.సోమయ్య, పి.కిషోర్, బీకేఎంయూ నాయకులు బండి వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని, కౌలు రైతు సంఘం నాయకులు కె.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.