క్షణికావేశంలో చేసిన నేరానికి జీవిత ఖైదు పడిన ఎంతో మంది కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్: క్షణికావేశంలో చేసిన నేరానికి జీవిత ఖైదు పడిన ఎంతో మంది కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. తమ శిక్షాకాలంలో సత్ప్రవర్తనతో మెలిగి అధికారులు తయారు చేసే సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో చేరి జైలు నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవనం గడపాలని భావించేవారు అనేకమంది ఉన్నారు. చాలామంది ఖైదీల్లో పూర్తి పరివర్తన వచ్చినా అసలు జైలు నుంచి విడుదలయ్యేంత వరకైనా ప్రాణాలతో ఉంటామా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురై ఏ క్షణాన ప్రాణాలు గాలిలో కలుస్తాయోనని భయపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 మంది అనారోగ్యంతో మృత్యువాతపడ్డారు. ఖైదీలు సరాసరిన నెలకొక్కరు అనారోగ్యంతో ప్రాణాలొదులుతున్నా జైలు అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు.
జైలులో ఖైదీలు ఆకస్మికంగా ఎందుకు మరణిస్తున్నారనే విషయంపై ప్రత్యేక దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జైలులో అన్ని రకాల ఖైదీలకు కలిపి ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఒకే ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఉదయం 9 గంటలకు వచ్చి హడావుడిగా వైద్యపరీక్షలు నిర్వహించి మధ్యాహ్నానికంతా వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కానీ జైలు అధికారులు మాత్రం ఉన్న ఒక వైద్యుడు ఉదయం 9 నుంచి వైద్యసేవలు అందిస్తున్నారని, మందుల కొరత లేదని చెబుతున్నారు. అధికారుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి తేడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వివిధ విద్యాసంస్థల్లో, ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లే కడప కేంద్ర కారాగారంలో కూడా తరచుగా వైద్య శిబిరాలు నిర్వహించి వారిని వే ధిస్తున్న వ్యాధులను గుర్తించి మందులు అందజేయడమో లేదా మెరుగైన వైద్యానికి సిఫార్సు చేయడమో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే చెప్పవచ్చు.
ఇటీవల ఖైదీల సంక్షేమ దినోత్సవం రోజున ఖైదీలందరి తరపున ఓ వృద్ధ ఖైదీ ఇంత పెద్ద కేంద్ర కారాగారంలో ఒకే వైద్యుడు ఉన్నారనీ, మందులు లేవని సాక్షాత్తు కలెక్టర్ కోన శశిధర్‌కు విన్నవించుకున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి డాక్టర్ల నియామకం, మందుల సరఫరా, ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జీవితఖైదీలలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఖైదీల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2013 జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు
2012 మార్చి 13న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సుంకమ్మ గుడి సమీపంలో కొత్త కొట్టాలు నివాసి కె.మల్లికార్జున(36) (సీటీ నంబర్ 4316)
అదే నెలలో 26వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతి నగరం, లాలయ్యకుంటకు చెందిన సుధా అలియాస్ సుధాకర్(33)
2013 జనవరి 7వ తేదీన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం ఈడిగవీధికి చెందిన ఈడిగ చప్పల నాగేంద్రయ్య(61) (సీటి నంబర్ 3776)
జూన్ 8వ తేదీన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వరయ్య మండలం మందిగప్ప గ్రామానికి చెందిన తెల్లికి వెంకటేసు(28)
సెప్టెంబర్ 23న తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా, తిరుత్తణి మండలం మద్దారు గ్రామానికి చెందిన ఏ.చక్రవర్తి(35)
సెప్టెంబర్ 21న కర్నూలు జిల్లా రుద్రవరం మండలం, చెరవాలి గ్రామానికి చెందిన మాలకుడాల రాముడు అలియాస్ స్వామిదాస్(58)
సెప్టెంబర్ 27న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు పాలకుబస్టాండు, పూలమార్కెట్ వీధిలో నివసిస్తున్న గోవిందు అలియాస్ జి.కుమార్ (సీటీ నంబర్ 928)
అక్టోబర్ 7న కర్నూలు జిల్లా వెలుగొడు మండలం గట్టితాండ గ్రామానికి చెందిన తోట చెంచు మద్దిలేటి అలియాస్ మద్దెలగోడు (41) (సీటీ నంబర్ 8602)
ఆదివారం తెల్లవారుజామున 3.30గంటలకు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తికి చెందిన కొర్రపాడు బాలకొండయ్య(42) (సీటీ నంబర్ 3917)
ఒకే డాక్టరే ఉన్నారు
కేంద్ర కారాగారంలో దాదాపు 1100 మందికి పైగా ఖైదీలున్నారు. వీరందరిని చూసేందుకు ముగ్గురు వైద్యులు అవసరం. కేవలం ఒక్కరే అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్‌ను కలిసి వైద్యులను పంపించాలని కోరాం. ప్రతి శనివారం రిమ్స్‌లో కొందరు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.
- వెంకటరాజు, డిప్యూటీ
సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం.