నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్
స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది. కేసును విచారించేందుకు సీబీసీఐడీ డీఎస్పీ మహేష్ నేతృత్వంలోని అధికారుల బృందం శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందు కోసం విద్యాశాఖాధికారులు అన్ని రికార్డులతో సిద్ధంగా ఉన్నారు. కాగా 63 మంది ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందారని మూడేళ్ల క్రితం గుర్తించారు. వీరిలో 59 మంది ఇంగ్లీష్ సబ్జెక్టు వారుండగా(ఒకరు మరణించారు, మరొకరు రివర్షన్ తీసుకొని ఎస్‌జీటీగా కొనసాగుతున్నారు), ముగ్గురు ఫిజికల్ సైన్స్, ఒకరు మ్యాథ్స్ సబ్జెక్టు వారు ఉన్నారు.
2009లో జరిగిన తంతు...
రాష్ట్ర ప్రభుత్వం 2009లో సెకండరీ టీచర్(ఎస్‌జీటీ)లకు పదోన్నతులు కల్పించింది. జెడ్పీ మేనేజ్‌మెంట్ పరిధిలో 277 ఇంగ్లీష్, 320 మ్యాథ్స్, 251 ఫిజికల్ సైన్స్‌తో పాటు ప్రభుత్వ మేనేజ్‌మెంట్ స్కూళ్లలో 16 ఇంగ్లీష్, 16 మ్యాథ్స్, 16 ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లను భర్తీ చేసేందుకు ఫిబ్రవరిలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ క్రమంలోనే బోగస్, నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ పదోన్నతులు పొందుతున్నారనే ఆరోపణలు రావడాన్ని గుర్తించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయంలో పక్క రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో సంబంధిత డిగ్రీలు పూర్తి చేసినట్లు కొందరు సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మిగతా సబ్జెక్టులకు ప్రమోషన్లు ఇచ్చినా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను వాయిదా వేశారు.
జిల్లాలో 63 మందికి ప్రమోషన్..
తమిళనాడుకు చెందిన వినాయకమిషన్, వినాయక రీసెర్స్ ఫౌండేషన్, రాజస్థాన్‌కు చెందిన జనార్దనరాయ్ యూనివర్సిటీల నుంచి పీజీ చదివినట్లుగా సర్టిఫికెట్లు సమర్పించి జిల్లాలో 59 మంది ఆంగ్లం, ముగ్గురు గణితం, ఒకరు ఫిజికల్ సైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఆయా రాష్ట్రాల్లోని యూనివర్శిటీ స్టడీ సెంటర్లకు అనుమతులు లేవన్న కారణంతో అదే ఏడాది మే నెలలో వారి పదోన్నతులు రద్దు చేస్తూ రివర్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక్కరు మాత్రమే రివర్షన్ తీసుకోగా మిగతావారు పదోన్నతుల్లో కొనసాగుతూ రాష్ట్ర అడ్మినిష్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తర్వాతే పదోన్నతులను రద్దు చేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులివ్వడంతో రివర్షన్ లేకుండా ఉన్నారు.
క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ..
ట్రిబ్యునల్ ఆదేశాలతో క్షేత్రస్థాయి సమగ్ర విచారణ బాధ్యతలను డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు చేపట్టారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు, ఆయా యూనివర్సిటీల్లో వారు పీజీ చేసిన తేదీల వివరాలను, కాల నిర్ణయ పట్టిక(టైంటేబుల్), ప్రాక్టికల్ తరగతులు నిర్వహించిన ప్రదేశం, ఫీజు చెల్లింపు రశీదులు, గుర్తింపు కార్డు, బోనోఫైడ్ సర్టిఫికెట్‌లు, ఆ సమయంలో సదరు ఉపాధ్యాయులు సెలవు లో ఉన్నారా? లేదా? ఉన్నత చదువులకు వెళ్లేం దుకు ఎవరి అనుమతి తీసుకుని వెళ్లారు? అన్న అంశాలపై విచారణ జరిపారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగించాలని 2012 అక్టోబర్‌లో లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడంతో విద్యాశాఖ ఉరుకులు, పరుగులు మీద రివర్షన్ ఇవ్వాలని చూశారు. కానీ సరిగ్గా ఏడా ది తర్వాత మళ్లీ ఈ అంశం తెరపై కొచ్చింది.
సర్టిఫికెట్లు అసలైనవేనంట...!
ప్రమోషన్ల కోసం ఉపాధ్యాయులు సమర్పించిన పీజీ సర్టిఫికెట్లపై విచారణ కోసం విద్యాశాఖ అధికారులు ఆయా యూనివర్సిటీలకు వెళ్లొచ్చారు. సదరు సర్టిఫికెట్లు వారే జారీ చేశారని నిర్ధారించుకువచ్చారు. అయితే సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులంతా నాలుగు రోజు ల్లోనే పీజీ ఎలా పూర్తి చేశారన్నది ప్రభుత్వ ప్రశ్న. చాలా మంది ఉపాధ్యాయులు కేవలం 4 రోజుల సెలవుపై వెళ్లినట్లు మాత్రమే రికార్డులుండటంతో తరగతులకు ఎలా వెళ్లారు, మిగతావి సెలవులు లేకుండా ఏ విధంగా వెళ్లడం సాధ్యమమైంది. పీజీ చేసేందుకు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం.. ఇలాంటి అనేక అంశాలను లోకాయుక్తకు నివేదించింది. దీనిపై లోకాయుక్త ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. శనివారం సదరు ఉపాధ్యాయులపై ఎఫ్‌ఐఆర్ జారీ కావచ్చునని తెలిసింది
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో టీచర్లపై.. క్రిమినల్ చర్యలు?
Published Sat, Sep 28 2013 3:19 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement