బడి.. సమస్యల ఒడి..
వేసవి సెలవులకు సెలవు.. ఇక బడిబాట సమయం ఆసన్నమైంది.. నెలన్నర రోజులు ఆనందంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు.. గురువారం బడిగంటలు మోగనున్నాయి.. ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి.. పుస్తకాలు, దుస్తులు అందలేదు.. మారిన సిలబస్‌కు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వలేదు.. ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి.. శిథిలావస్థకు చేరిన, మొండిగోడల వరకు నిర్మించిన అసంపూర్తి గదులు ఆహ్వానిస్తున్నాయి.. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి.. మధ్యాహ్న భోజన షెడ్లు ఊరవనున్నాయి.. తదితర సమస్యలపై ‘ఫోకస్’.. - మంచిర్యాల సిటీ
మంచిర్యాల సిటీ : చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన జిల్లా ఆదిలాబాద్.. అంతటి ప్రాధాన్యం కలిగి ఉన్న జిల్లా విద్యాశాఖలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరో రెండ్రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కానీ.. ఎప్పటిలాగే ఈసారీ విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పుస్తకాలు.. దుస్తులు సమయానికి అందేలా లేవు. ఉపాధ్యాయులను భర్తీ చేసింది లేదు. మరికొన్ని చోట్ల అయితే.. పాఠశాలలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం.
ఫలితంగా శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగించనున్నారు. లేదంటే చెట్ల కిందే పాఠాలు వినాల్సిందే. ఇలా ఒకటేమిటి.. చెబుతూ పోతే అన్నీ సమస్యలే. కనీసం ఈసారైనా ఉన్నతాధికారులు ఆ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
దుస్తులు..
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 23 తేదీ నాటికి ఏకరూప దుస్తులు అందజేయాలి. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను కుట్టించి ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వం జతకు రూ.200 చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని 1,15,655 మంది బాలికలకు, 1,11,854 మంది బాలురకు దుస్తులు అందజేయాలి. కానీ.. ఇప్పటి వరకు జిల్లాలోని 52 మండలాల్లో 42 మండలాల విద్యార్థులకు మాత్రమే దుస్తులు సరఫరా ఆయ్యాయి. మరో 10 మండలాల విద్యార్థులకు తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అందివ్వనున్నామని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు.
పాఠశాలలు.. ఖాళీలు..
జిల్లాలో ప్రభుత్వ అజమాయిషీలో 3,084 ప్రాథమిక, 444 ప్రాథమికోన్నత, 468 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 30,398, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 50,712, ఉన్నత పాఠశాలల్లో 54,301 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే.. ఉపాధ్యాయ పోస్టులు మాత్రం ఏటా కొరతగానే కనిపిస్తున్నాయి. 38 ఉన్నత పాఠశాలల్లో పీజీ ప్రధానోపాధ్యాయులు లేరు.
ఇక్కడ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు ఒక వైపు పాఠాలు చెబుతూనే మరోవైపు పాఠశాల బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. 356 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైదాన ప్రాంతంలో 200, ఏజెన్సీ ప్రాంతంలో 156 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్నత పాఠశాలల్లో బోధన అస్తవ్యస్తంగా తయారైంది. వీటికి తోడు 785 ఎస్‌జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మైదాన ప్రాంతంలో 440, ఏజెన్సీ ప్రాంతంలో 345 ఖాళీగా ఉన్నాయి.
పదోన్నతులు లేవు..
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ జనవరి, 2012న నిలిచి పోయింది. కొందరు ఉపాధ్యాయులు ఏజెన్సీ, మైదాన పోస్టుల విషయంలో కోర్టుకు వెళ్లడం తో పదోన్నతి నిలిచింది. గతంలో ప్రతి నెలా ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ జరిగేది. దీంతో ఉన్నత పాఠశాలల్లో వెంట, వెంటనే ఖాళీలు భర్తీ అయ్యేవి. విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండేది. ప్రస్తుతం ఆ ప్రక్రియకు బ్రేక్ పడడంతో ఖాళీలు దర్శనమిస్తున్నాయి.