సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి ఎక్బాల్ అహ్మద్ హెచ్చరించారు. త్వరలోనే జిల్లా పర్యటన చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమై వక్ఫ్ ఆస్తుల గురించి చర్చిస్తానని ఆయన తెలిపారు.
వక్ఫ్ భూములను అనుమతులు లేకుండా కబ్జా చేసిన వారిని, అక్రమ లీజుకు తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్‌బోర్డు ఆస్తులపై ‘న్యూస్‌లైన్’ ఆయనతో ఫోన్‌లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయినట్లు చెప్పారు. అందుకు బాధ్యులైన ముతవలీలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టిస్తామన్నారు.
ప్రధానంగా నిజామాబాద్ కంఠేశ్వర్ ప్రాంతంలో గల దర్గా హజరత్ కమాల్‌షా బియాబానికి సంబంధించిన ఆస్తులను ముతవలీగా ఉన్న శేర్‌అలీషా బోర్డు అనుమతులు లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.ఆ ఆస్తులను బోర్డు స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ ఆస్తులను అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోర్డు అనుమతులు లేకుండా అక్రమ లీజుకు ఇచ్చిన ముత్తవ లీ శేర్‌అలీషాపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదని తెలిపారు.
బోర్డు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేసేది లేదన్నారు. జిల్లాలోని ఆస్తులను గుర్తించి వాటి వివరాలను సేకరించే పనిలో తమ సిబ్బంది నిమగ్నమయ్యారని తెలిపారు. నివేదిక రాగానే తాను జిల్లా పర్యటనకు వస్తానని ఆయన చెప్పారు.
అక్రమాలు వెలుగు చూసింది ఇలా...
జిల్లాలో కబ్జాకు గురైన వక్ఫ్ ఆస్తులను వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ చైర్మన్ మహ్మద్ మాజిద్‌ఖాన్ వెలికి తీశారు. కోట్ల రూపాయల విలువ చేసే కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా హజరత్ కమాల్‌షా బియాబానికి పేరుతో ఉన్న ఆస్తులతో పాటు, నగరంలోని పాత ఈద్గాకు చెందిన స్థలాల వివరాలను బోర్డుకు ఆయన నివేదిక అందజేశారు. అక్రమాలకు పాల్పడ్డ ముత్తవలీపై చర్యలు తీసుకోవాలని బోర్డుకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుపై స్పందించిన బోర్డు టాస్క్‌ఫోర్స్ బృందం నగరంలో పర్యటించి విచారించింది. బృందం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించింది. దీంతో ముత్తవలీపై క్రిమినల్ కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేశారు. దర్గాకు సంబంధించిన ఆస్తులను తమ ఆధీనంలోకి(డెరైక్ట్ మేనేజ్‌మెంట్)లోకి తీసుకున్నారు.అయినప్పటికి ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయక పోవడమే కాకుండా బోర్డుకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా పెట్రోల్‌బంక్ నిర్మాణానికి కొత్త చైర్మన్ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీనిపై సీరియస్‌గా ఉన్న ప్రత్యేకాధికారి ఎక్బాల్‌అహ్మద్ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. అదే విధంగా బోర్డు స్థలాల్లో నిర్మించిన ఫంక్షన్‌హాల్, గ్యాస్‌పంపులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
వక్ఫ్ ఆస్తులను కబ్జాచేస్తే క్రిమినల్ కేసులు
Published Thu, Feb 13 2014 3:29 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement