
వర్షాలకు నీట మునిగిన పంట
వజ్రపుకొత్తూరు రూరల్ శ్రీకాకుళం : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఓవైపు వరద నీటితో నువ్వలరేవు ఉప్పుటేరు పొంగుతుంటే, మరో వైపు గెడ్డలు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వజ్రపుకొత్తూరు మండలంలోని వజ్రపుకొత్తూరు, బెండి, నగరంపల్లి, తాడివాడ, కిడిసింగి, గుళ్లలపాడు, సీతాపురం, పెద్దబొడ్డపాడుతో పాటు మరో 10 గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి పంట వర్షార్పణమైంది.
కళ్లముందే పంటంతా నీటిలో మునిగి కుళ్లిపోతుంటే ఏంచేయాలో తోచక రైతులు ఆందోళన చెంందుతునన్నారు. నువ్వలరేవు, పరిసర ప్రాంతాల్లో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు సష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
రైతుల సంక్షేమం పట్టదా?
నువ్వలరేవులో ఏర్పడిన పొగురుతో వేలాది ఎకరాల్లో పంట నీట మునుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలో వజ్రపుకొత్తూరు వద్ద ముంపునకు గురైన పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించి ఆరా తీశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్‌ఆర్ సీపీ మండల అధ్యక్షోఉడు పి.గుర్రయ్యనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు డి.మధుకేశ్వరరావు, నాయకులు మర డ భాస్కరరావు, బి.మోహన్‌రావు, శ్యాం, భీమారావు, రఘు, పురుషోత్తం తదితరులు ఉన్నారు.