నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగు..ఖతమైంది. ఆగస్టు మాసం పూర్తి కావడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఇక ముగిసిందని చెప్పవచ్చు. ఈ సారి సాధారణ సాగుకంటే 56,136 హెక్టార్లు తగ్గింది. వరుణుడు కరుణించకపోవడం.. సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి విడుదలపై నెలకొన్న సందిగ్ధత.. చివరకు నీటి విడుదల చేయడం తదితర కారణాలతో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. సీజన్ ప్రారంభంలో వరుణుడు కొంత కరుణించినప్పటికీ తరువాత ముఖం చాటేయడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. దీంతో నాన్ ఆయకట్టు ప్రాంతంలో మెట్టపంటలను సాగుపై దృష్టిసారించారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 93 వేల 445 హెక్టార్లకు గాను ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711 హెక్టార్లలో సాగు చేశారు. అయినప్పటికీ గత ఖరీఫ్ కంటే 30వేల 113 హెక్టార్లలో పతి పంట సాగు తగ్గింది. గత ఖరీఫ్‌లో 2,97,824 హెక్టార్లలో సాగు కావడం విశేషం.
సాగు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5,08,938 హెకార్లు కాగా ఇప్పటి వర కు 4,52,802 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగుకు నోచుకున్నాయి. ఇంకా 56,136హెక్టార్లు సాగుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కొంత మేరకు వరి సాగు అయ్యే ఆవకాశం ఉంది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,10,034 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసుకున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో వరి పంట 1,17,059హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 1,12,674 హెక్టార్లలో సాగుకు నోచుకుంది.
అదే విధంగా గత ఖరీఫ్‌లో పత్తి 2,97,824 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711హెక్టార్లలో సాగు చేశారు. దీంతో పత్తి 30,113 హెక్టార్లలో తగ్గినట్లయ్యింది. ఇతర కంది, పెసర, మొక్కజొన్న పంటల సాగు మోస్తరుగా ఉంది. వాణిజ్య పంటల ఊసేలేదు. గత ఖరీఫ్‌లో పంటల సాగు సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువగా సాగుకు నోచుకున్నప్పటికీ కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూశారు. ప్రస్తుత ఖరీఫ్‌లోనైనా ప్రకృతి కరుణిస్తే పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చి ఆర్థికంగా లాభాల బాటలో పయనిస్తామని ఆశలో ఆన్నదాతలు ఉన్నారు.
15వేల హెక్టార్ల వరిసాగు పెరిగే అవకాశం :
జేడీఏ, బి.నర్సింహారావు
ఆయకట్టులో ప్రస్తుతం నాట్లు వేసేందుకు రైతులు నార్లు సిద్ధం చేస్తున్నారు. వీరు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. మరో 15వేల హెక్టార్ల వరిసాగు పెరుగుతుందని భావిస్తున్నాం. వరి సాగు చేయదలుచుకుంటే డ్రమ్‌సీడర్ ద్వారా నేరుగా నాటు వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి.
ఖరీఫ్.. ఖతం
Published Sun, Sep 1 2013 5:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement