గణాంకాల గారడీ!
Published Wed, Sep 18 2013 4:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
సాక్షి, కొత్తగూడెం: రైతులకు పంట రుణాల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. కాగితాలలో లక్ష్యం పూర్తయినట్లు కనపడుతున్నప్పటికీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. కొత్త రుణాలు ఇవ్వకుండా గతంలో రైతులు తీసుకున్న వాటిని రెన్యువల్ చేస్తూ బ్యాంకర్లు లక్ష్యం సాధించినట్లు రికార్డులు చూపుతుండడం గమనార్హం. ఏటా ఇదే రీతిలో రుణ పంపిణీ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 889.90 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు కాగితాల్లో చూపిస్తుండగా ఇందులో 711.92 కోట్లు పాతవే రెన్యువల్ చేయడం గమనార్హం.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే రుణాలలో 74 శాతం పురోగతి సాధించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు పంట రుణాలు అందలేదు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. పెట్టుబడి పెట్టే పరిస్థితి లేని ఈ తరుణంలో రుణమిచ్చి అండగా నిలవాల్సిన సర్కారు.. పాత రుణాలనే తిరగరాస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బ్యాంకు రికార్డుల్లో కొత్తగా రుణం తీసుకున్నట్లు గణాంకాలు కన్పిస్తున్నప్పటికీ... చేతికి మాత్రం చిల్లిగవ్వ రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. వేల మంది రైతులు రుణం కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పాతవే రెన్యువల్ చేసి టార్గెట్ పూర్తి చేశాం అనేరీతిలో వ్యవహరిస్తుండడంతో మాకేమి ఉపయోగం అంటూ ఆవేదన చెందుతున్నారు.
కాగితాల్లో గారడీ..
2013 ఖరీఫ్ సీజన్‌లో జిల్లా రైతాంగానికి 1,199 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రుణ మంజూరుకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు రెండు లక్షల మంది రైతులకు 889.90 కోట్ల రూపాయలు పంట రుణాల కింద పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 74 శాతం పురోగతి సాధించినట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇవన్నీ కొత్తగా పంపిణీ చేసిన రుణాలు కాదు. గతంలో పెండింగ్‌లో ఉన్న రుణాలను ఈ ఏడాది భారీగా రెన్యువల్ చేశారు. ఇప్పటివరకు అలా సాధించిన పురోగతిలో 80 శాతం రెన్యువల్ చేసినవేనని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన చూస్తే మంజూరు చేసిన 889.90 కోట్ల రుణాల్లో 711.92 కోట్లు తిరగరాసినవే. కేవలం 178 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే కొత్తగా రైతులకు మంజూరు చేశారు.
కౌలురైతులపై కనికరం ఏదీ..?
అష్టకష్టాల కోర్చి పంట సాగుకు సిద్ధమవుతున్న కౌలురైతులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. కౌలు రైతులకు పంట రుణాలిస్తామంటూ చెప్పిన సర్కారు బ్యాంకర్లతో రుణాలు మంజూరు చేయించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 68,906 మంది కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది కౌలు రైతులున్నా ఇప్పటి వరకు 20 వేల మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు మంజూరు చేశారు. వీరిలో కేవలం 3,001 మందికి రుణాలు మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 ఖరీఫ్, రబీలో కౌలు రైతులకు 20 కోట్ల రూపాయలు రుణం లక్ష్యంగా పెట్టుకోగా నేటికి 8.63 కోట్లు మంజూరు చేశారు. రుణ అర్హత కార్డులు మంజూరైనా రుణం అందకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పుచేసి.. చివరకు పంట నష్టపోయి, చేసిన అప్పుకు వడ్డీకి పెరిగి కౌలు రైతులు అత్యహత్యలకు పాల్పడుతున్నారు. అయినా సర్కారులో చలనం లేదు.
Advertisement
Advertisement