జిల్లా గ్యాస్ వినియోగదారుల నెత్తిన రూ.1.25కోట్ల భారం పడింది. పిడుగులాంటి ఈ వార్తతో గృహిణులు భగ్గుమంటున్నారు. వంటింట్లోకి వెళ్లేందుకు కంటతడిపెట్టుకుంటున్నారు. తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీక ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. రోజుకో రకంగా ధరల భారాన్ని మోపుతున్న పాలకుల వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో తలెత్తితే తక్షణమే తన బాధ్యతగా ఆ భారాన్ని భరిస్తూ అప్పట్లో వై.ఎస్. తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అసలే కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన మొదటి రోజే వంటగ్యాస్‌పై ప్రభుత్వం మంటపెట్టింది. దీంతో అన్ని రకాల గ్యాస్ వినియోగదారులంతా భగ్గుమంటున్నారు. ఎప్పుడు నాన్ సబ్సిడీ గ్యాస్‌పై పెంచే ప్రభుత్వం ఈసారి సబ్సిడీ గ్యాస్‌పై ఏకంగా రూ.25పెంచి పరేషాన్‌కి గురిచేసింది. ఈకారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 5లక్షల గ్యాస్ వినియోగదారులపై రూ.కోటి 25లక్షలకు పైగా భారం పడింది. దీంతో రెండు రోజుల క్రితం రూ.417 ఉన్న గ్యాస్ ధర పెంపుతో రూ.442.50కి చేరింది. కొత్త యేడాది గ్యాస్ మంటపై వినియోగదారులు మండిపడుతున్నారు. అసలే ఆన్‌లైన్ పేరుతో గ్యాస్‌ను అందకుండా చేశారు, ఇప్పుడు ధరల మోతతో కొనకుండా చేస్తున్నారంటూ వారంతా ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ సబ్సిడీ అయోమయం
ఇక ప్రస్తుతం 5లక్షల గ్యాస్ వినియోగదారుల్లో 60వేలకు పైగా గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం చేసుకొన్నారు. వీరి కి బుక్ చేసుకొన్న వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలో స బ్సిడీ జమఅవుతోంది. ఇక వీరికైతే ఏకంగా రూ.232పెంచారు. ముందుగా రూ.1130నుంచి పెంపుతో రూ.1362 కు చేరింది. కానీ వీరికి బ్యాంక్‌లో జమ అయ్యే సబ్సిడీ మాత్రం రూ.430లే జమఅవుతోంది. ఈకారణంగా స బ్సిడీని పూర్తిగా కోల్పోగా వీరంతా అదనంగా రూ.930 భారాన్ని భరించాల్సి వస్తోంది. ఇక దీనిపై వినియోగదారులు ఎవ్వర్ని ఆడగాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈసబ్సిడీ ఎక్కడ్నుంచి ఆన్‌లైన్‌లో జమఅవుతోందో ఎవ్వరికి తెలియని వైనంగా మారింది.
వాణిజ్య సిలిండర్లపై రూ.385పెంపు
ఇదిలా ఉండగా వాణిజ్య సిలిండర్లపై ఏకంగా రూ.385పెంచి మోయలేని భారాన్ని వేశారు. దీంతో 9వేల వాణిజ్య వినియోగదారులపై ఈ భారం పడింది. పెంచిన ప్రకారం ఇలా పాతది రూ.1937 ఉండగా, పెంపుతో రూ.2322కు చేరింది. ఇలా అన్ని రకాల గ్యాస్ వినియోగదారులకు కొత్త ఏడాది సంతోషం లేకుండా ఈప్రభుత్వం చేసింది.
ఇంకా పాత ధరలే...!
ఇక పౌరసరఫాలశాఖ కార్యాలయంలో ఇంకా పాత ధరల పట్టికే ఉండడం విస్మయ పరుస్తోంది. అంతే కాకుండా అధికారుల పర్యవేక్షణాలోపానికి ఇదో పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. ఈ పట్టిక ప్రకారం సబ్సిడీ గ్యాస్ ధర రూ.404 అని పేర్కొన్నారు. ఇక బియ్యం రూ.1కే అందిస్తుండగా ఇక్కడ మాత్రం రూ.2 చూపుతోంది. ఇవంతా కార్యాలయం సందర్శించేవారికి గందరగోళ పరుస్తున్నా అధికారులు మాత్రం కలత చెందడం లేదు. వారికిది షరా మామూలుగానే భావిస్తున్నారు.
పెంచిన ధరతో కొనలేని పరిస్థితి
రోజూ పనిచేస్తేనే పూటగడవ డం కష్టం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ దొరకడమే అతికష్టమైంది. ఇప్పుడు గ్యాస్ ధరను పెంచడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. మాలాంటి సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అయినా పెంచిన ధరను తగ్గించాలి.
- పార్వతి, హౌసింగ్‌బోర్డుకాలనీ
ఆధార్ ఇచ్చి పరేషాన్‌లో పడ్డాం
సబ్సిడీ సిలిండర్ రాదని భయపెడితే వెంటనే ఆధార్‌కార్డుని నమోదు చేసుకొన్నాం. అప్పట్నుంచి ఉన్న సబ్సిడీని కోల్పోగా, నాన్‌సబ్సిడీ సిలెండర్‌కు రూ..1130 చెల్లించడమే కష్టమైంది. ఇప్పుడు ఏకంగా రూ..232పెంచి ఈధరను రూ.1362కు చేర్చడంతో గ్యాస్ కొంటామనే ఆశల్ని వదులు కోవాల్సిన పరిస్థితి.
- పద్మ, మహబూబ్‌నగర్