అట్రాసిటీ కేసులపై నిర్లక్ష్యం వద్దు | cases | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులపై నిర్లక్ష్యం వద్దు

Published Fri, Feb 6 2015 2:01 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

cases

మహబూబ్‌నగర్ టౌన్: తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులతోపాటు పెండింగ్‌లో ఉన్న దళితుల సమస్యలను మరో వారంరోజుల్లో పరిష్కరించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ జిల్లా అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశమందిరంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు పరిష్కారం కాని సమస్యలపై సమీక్షించారు.
 
  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో ఉన్న కేసులకు వారం రోజుల్లో పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో ఉన్న వాటిని కమిషన్ దృష్టికి తీసుకెళ్లి నెలరోజుల్లో పరిష్కారమయ్యేలా చూస్తామని భరోసాఇచ్చారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వపథకాల్లో దళితులకు ప్రతిపాదించిన మేరకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భూపంపిణీకి సంబంధించి దళితులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను కోరారు.
 
 కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే రుణాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవిని కోరారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించి దళితులను న్యాయం చేస్తామని కలెక్టర్ స్పష్టంచేశారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు జిల్లా అధికారులు స్పందించకపోతే ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని కోరారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.  
 
 ఫిర్యాదుల పరంపర
 పేరమ్మ(గద్వాల): నాపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని ఐదేళ్లుగా ఫిర్యాదుచేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నాదే తప్పని పేర్కొంటూ కేసును కొట్టేసే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నాపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
 
 కమిషన్ సభ్యురాలు: వెంటనే విచారణ జరిపి వారం రోజుల్లో కేసు పరిష్కరించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
 
 వెంకటమ్మ(వెల్దండ): దాయాదాలు మా భూమిని కబ్జాచేసుకుని ఏడేళ్లుగా సాగుచేసుకుంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నా భూమి నాకు ఇప్పించి న్యా యం చేయండి.
 
 కమిషన్ సభ్యురాలు: వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ విశ్వప్రసాద్‌ను కోరారు.
 
 డప్పు బుచ్చమ్మ(నారాయణపేట): నేను రైస్‌మిల్లులో పనిచేస్తుండగా కిందపడ్డ. ఇంతవరకు పరిహారం లేదు. యజమానిపై చర్యలు తీసుకోలేదు. కేసు నమోదుచేయాలని పోలీసు అధికారులను కోరినా స్పందించడం లేదు.
 
 కమిషన్ సభ్యురాలు: వెంటనే యజమానిపై చర్యలు తీసుకొని, పరిహారం ఇచ్చే లా కఠినచర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో తనకు నివేదికలు పంపాల్సింది గా అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ పి.విశ్వప్రసాద్, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో డాక్టర్ రాంకిషన్, సోషల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓలు, డీ ఎస్పీలతో పాటు తహశీల్దార్లు, ఎన్‌జీఓ, దళితసంఘాల నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement