తెలంగాణ అంశంపై టీడీపీ అనుసరిస్తున్న రెండు కళ్ల విధానంతో జిల్లాలో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోగా.. మరో ఎమ్మెల్యే సైతం వారి దారిలో వెళుతున్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు గులాబీ గూటికి చేరాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే సీటు ఖరారు కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆదివారం మంతనాలు జరిపిన ఆయన.. టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సాక్షి, నిజామాబాద్/నిజాంసాగర్, న్యూస్‌లైన్
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితో విసిగి వేసారిపోయిన ఆ పార్టీ నాయకులు పార్టీలు మారుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ప్రజాభీష్టం మేరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు టీడీపీకి గుడ్ బై చెప్పి, గులాబీ గూటికి చేరారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే సైతం టీడీపీని వీడతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుతోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుజ్జగించడంతో ఆయన తెలుగు దేశం పార్టీలోనే కొనసాగారు.
ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి
తెలంగాణ ఏర్పాటకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో చంద్రబాబు పూటకో మాట మార్చుతుండడంతో టీడీపీకి చెందిన ఈ ప్రాంతంలోని నాయకులు ఇబ్బం ది పడుతున్నారు. నాయకులు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు వచ్చాయి. ఇందుకు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ. కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు జిల్లాలో కార్యరూపం దాల్చలేదు. ఒకటీ రెండు గ్రామా ల్లో మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చి నేతలు చేతులు దులుపుకున్నారు. ఇటీవల జరిగిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించలేదు. వేదికపై ఉన్న నేతలకంటే సమావేశానికి హాజరైన కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉందంటే ఆ పార్టీ క్యాడర్‌ను ఏమేరకు కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు.
భవిష్యత్ ఉండదని..
తెలంగాణ రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన సమయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖ రి ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిం ది. ఇంకా ఆ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని భావిస్తున్న పలువురు నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే అంశంపై జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మూడు రోజులపాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. వారు టీఆర్‌ఎస్‌లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జుక్కల్ టికెట్టు ఇస్తామంటేనే టీఆర్‌ఎస్‌లో చేరాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయమై హన్మంత్ సింధే ఆదివారం హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశమై మంతనాలు జరిపా రు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. త్వరలో జుక్కల్‌లో బహిరంగ సభ నిర్వహించి, కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
మరో ఇద్దరు..
టీడీపీకి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి నిట్టు వేణుగోపాల్‌రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
జిల్లా కోటకు బీటలు
టీడీపీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండే ది. 2009 ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగాను ఐదింటిని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. పోచారం, గంప, తాజాగా సింధే పార్టీని వీడారు. జిల్లా లో ఇప్పటికీ నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు లేరు. దీనికి జుక్కల్ జత కలుస్తోంది. ఎల్లారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు నాలుగేళ్లుగా ఇన్‌చార్జిలను ఖరారు చేయలేని పరిస్థితి ఉంది. ఎల్లారెడ్డి నియోకవర్గ ఇన్‌చార్జి పదవిని ఇస్తామంటూ అధినేత బుజ్జగించినా కూడా తీసుకునేందుకు నేతలెవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితి టీడీపీని కలవర పరుస్తోంది.
సైకిల్ పంక్చర్
Published Mon, Dec 16 2013 2:46 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement