సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలలో ఇందూరు ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. ప్రచార ఆర్భాటాలు చేసిన నేతలకు షాక్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీల అంచనాలు తలకిందులయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో ఫలితాలు ఊహించని విధంగా వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఆర్మూరు, బోధన్‌లోని రెండు వార్డులతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ని జామాబాద్ కార్పొరేషన్, కా మారెడ్డి మున్సిపాలిటీలలో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు గత ఎన్నికలలో నిజామాబాద్ ఒక డివిజన్, బోధన్‌లో ఐదు వార్డులకు పరిమితమైన ఎంఐఎం ఈసారి అ నూహ్యంగా మెజార్టీ సాధించి మేయర్ పీఠంపై కన్నే సింది.
నగరపాలక సంస్థలో కాంగ్రెస్‌తో సమానంగా 16 డివిజన్లను గెలుచుకున్న ఆ పార్టీ, బోధన్‌లో ఏడు, కామారెడ్డిలో ఒక వార్డు గెలిచి చైర్మన్ ఎంపికలో చక్రం తి ప్పే స్థాయిలో ఉంది. మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్ హంగ్ దిశగా ఉండగా, కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసింది. బోధన్, అర్మూరు మున్సిపాలిటీలలో ఇతర పార్టీలకన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినా, చైర్మన్‌ను ఎన్నుకునే బలం లేదు. బోధన్‌లో ఎంఐఎం. ఆర్మూరులో ఎక్స్‌అఫీషియో ఓట్లపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.
తగ్గిన కాంగ్రెస్ ప్రాబల్యం
నిజామాబాద్ నగరపాలక సంస్థలో గత ఎన్నికలతో పోల్చితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. 50 డివిజన్లకుగాను గత ఎన్నికలలో 31 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ గెలుచుకుంటే, ఈ సారి 16 డివిజన్లకే పరిమితం అయ్యింది. మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ప్రచార బాధ్యతలను మీదేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులను కూడగట్టి, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న డీఎస్ కృషికి ఆశించిన ఫలితం దక్కలేదు. కాగా, గత ఎన్నికలలో ఏడు డివిజన్లను కైవసం చేసుకున్న టీడీపీ ఈ సారి ఖాతా తెరవని స్థితికి దిగజారింది.
బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య రెండు నుంచి ఆరుకు పెరగగా, స్వతంత్రుల సంఖ్య నాలుగు నుంచి రెండుకు తగ్గింది. నిజామాబాద్‌లో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన ఎంఐఎం ఈసారి 16 డివిజన్లు సాధించుకుని మేయర్ పీఠం దక్కించుకోవడానికి తహతహలాడుతుండటం సంచలనం కలిగిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు స్పష్టమైన మెజార్టీ రాగా, బోధన్, ఆర్మూరులో ఇతరుల మద్దతుతోగానీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ల ఓట్లతో గట్టెక్కే స్థితిలో ఉంది.
పీఠం కోసం
ఇదిలా ఉండగా, కార్పోరేషన్ మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎంఐఎం పార్టీకి మద్దతు ఇవ్వడమా? తీసుకోవడమా? మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకోవడమా? అన్న అంశాలను ఆ మూడు పార్టీల అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ ఎక్కడ?
తెలుగుదేశం పార్టీ పురపోరులో పూర్తిగా ఉనికి కోల్పోయింది. పార్టీ బ్యానర్‌పై పోటీ చేసిన పలువురు ఓటమిని చవిచూడగా, వ్యక్తిగతంగా పేరున్న నేతలు కౌన్సిలర్లు గా గెలుపొందారు. మొత్తం 141 డివిజన్లు, వార్డుల్లో గత ఎన్నికల్లో 35 గెలుపొందగా, ఈ సారి కేవలం రెండు చోట్లే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అర్మూరు, బోధన్‌లలో ఒక్కొక్కరు నెగ్గారు. ఎంఐఎం. బలం అనూహ్యంగా పెరిగింది. నగరపాలక సంస్థలో ఒక స్థానం నుంచి 16కు పెరగగా, గత ఎన్నికల్లో 6 డివిజన్లు, వార్డులకే పరిమితమైన ఆ పార్టీకి సంఖ్య మొత్తంగా 24కు పెరిగింది. టీఆర్‌ఎస్ గత ఎన్నికలలో మూడు డివిజన్లు, రెండు వార్టులకే సరిపెటుకోగా.. ఈ సారి 10 డివిజన్లు, 24 వార్డులను కైవసం చేసుకొని బలాన్ని పెంచుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. మొత్తంగా 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది.
‘పుర’పోరులో అనూహ్య ఫలితాలు
Published Tue, May 13 2014 2:56 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement