
ఓ పక్షి పేరు మీద.. హుదూద్ తుఫాను!
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలను వణికిస్తున్న హుదూద్ తుఫానుకు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్రళయ భీకరంగా దూసుకొస్తున్న ఈ తుఫానుకు వాస్తవానికి ఒక అందమైన పక్షి పేరు పెట్టారు. ఈ పక్షి సాధారణంగా ఒమన్, ఇతర గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఈసారి తుఫానుకు పేరుపెట్టే అవకాశం ఒమన్కు లభించింది. బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లకు ఆసియా దేశాలు పేర్లు పెడతాయి. ఒకేసారి రెండు సముద్రాలలోను తుఫాను ఏర్పడితే అప్పటికే ఇచ్చిన పేర్లలోంచి ఒకదాన్ని ఎంచుకుంటారు. అలా ఈసారి ఒమన్కు అవకాశం రావడంతో, ఆ దేశం ఇప్పటికే సూచించిన హుదూద్ పేరును ఖరారు చేశారు.
అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా తుఫాన్లకు పేర్లు పెడుతూనే ఉంటారు. దాన్ని త్వరగా గుర్తుపట్టి, హెచ్చరికలను అర్థం చేసుకోడానికి వీలుగా ఉంటుందనే వీటికి పేర్లు పెడతారు. దాదాపు ఒక శతాబ్దం క్రితం కరేబియన్ దీవుల్లో ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలైంది. అయితే, ఆసియా దేశాల్లో మాత్రం 2000 సంవత్సరం వరకు తుఫాన్లకు పేర్లు పెట్టలేదు. అందుకే 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమను వణికించిన తుఫానుకు గానీ, అలాగే 1999 అక్టోబర్ 29న ఒడిశా తీరాన్ని అతలాకుతలం చేసిన తుఫానుకు గానీ పేర్లు లేవు.