కందిపప్పు డబుల్ సెంచరీ!
దసరా వేళ.. ఘుమఘుమలు లేనట్టే!
సామాన్యుడు దసరా పూట గారె ముక్కకు సైతం నోచుకోలేక పోతున్నాడు. కనీసం బూరె తినే పరిస్థితి లేకుండా పోయింది. చుక్కలనంటుతున్న పప్పుల ధరలను చూస్తుంటే.. గారె, బూరెలే కాదు.. పండుగ పూట ఏ ఒక్క పిండివంట కూడా వండు కోలేని దుస్థితిలో సామాన్య, మధ్యతరగతి ్రపజలు అల్లాడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉల్లిధరలు కంటనీరు తెప్పిస్తే.. ఇప్పుడు పప్పులు.. వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.చరిత్రలో ముందెన్నడూ లేనీ స్థాయిలో కందిపప్పు ధర ఏకంగా డబుల్ సెంచరీ దాటింది. ప్రస్తుతం మార్కెట్‌లో నాసిరకం పప్పు రూ.180లుంటే..నాణ్యమైన పప్పు ఏకంగా 210కి చేరింది.
గతేడాది ఇదే సమయానికి కిలోకందిపప్పు రూ.80లు పలికింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ లోనే 50 కేజీల కందిపప్పు బస్తా రూ.10వేలు పలుకుతోంది. దీంతో ప్రస్తుతం ఏకంగా రెండున్నర రెట్లు పెరగడం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మినపప్పు అయితే ఏకంగా రూ.190 పలుకుతుంది. గతేడాది ఇదే సీజన్‌లో మినపప్పు రూ.70ల లోపే ఉండేది. కానీ ప్రస్తుతం కందిపప్పు ధర సరసన చేరేందుకు మినపప్పు కూడా ఉరకలేస్తోంది. దీంతో బూరెలు కాదు కదా..కనీసం ఉదయం అల్పాహారంగాతీసుకునే ఇడ్లీముక్కకూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఆయిల్ ధరలు కూడా ఏమాత్రం తీసిపోని రీతిలో ఎగబాకు తున్నాయి. నిన్నమొన్నటివరకు లీటర్ రూ.70 ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ నాలుగైదు రోజుల్లోనే రూ.85కు చేరింది. జీతాలపై ఆధారపడి జీవనం సాగించే ఈ బడ్జెట్ బతుకులు రోజురోజుకు చుక్కలనంటుతున్న పప్పుల ధరలతో బిత్తరపోతున్నారు. వ్యాపారులు సైతం పప్పుల ధర చెప్పేందుకు భయపడుతున్నారు. నాగ్‌పూర్ పప్పు మార్కెట్‌లో కానరావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట తొమ్మిది సరుకులను ప్రభూత్వం అందజేసింది. రంజాన్‌పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోపా అందజేశారు. కానీ హిందువులకు రెండో పెద్దపండుగగా భావించే దసరా పండుగ రోజుల్లో ఎలాంటి కానుకలను ప్రభుత్వం ప్రకటించలేదు. పైగా కనీసం డిపోల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు సరఫరా కూడా పునరుద్ధరిస్తానుకుంటే అదీలేదు. దీంతోఈ ఏడాది దసరా పర్వదినాన సామాన్య, మధ్యతరగతి ఇళ్లల్లో ఘుమఘుమలు లేనట్టే.