దళిత యువతిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన జరిగింది. పట్టణానికి చెందిన కాంచన అనే యువతి షేక్‌షావలి యువకుడిని ప్రేమించి ఇటీవల పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను భర్త నుంచి వేరు చేసి తమతో ఇంటికి తీసుకెళ్లారు.
అయితే, ఆమె బుధవారం అక్కడి నుంచి గుంతకల్లు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. తమను వేరు చేసేందుకు కుటుంబసభ్యులు యత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సై తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆమె పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఆమె తరఫు వారు అక్కడికి చేరుకుని మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరిపారు. షేక్‌షావలి, కాంచన వివాహంపై రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ జరిపి వారిని ఇళ్లకు పంపించివేయటంతో కథ సుఖాంతమైంది.