దర్శి టీడీపీలో దోబూచులాట | Darsi TDP Assembly Ticket Issue In Prakasam | Sakshi
Sakshi News home page

దర్శి టీడీపీలో దోబూచులాట

Published Fri, Mar 22 2019 1:30 PM | Last Updated on Fri, Mar 22 2019 1:33 PM

Darsi TDP Assembly Ticket Issue In Prakasam - Sakshi

దర్శి నియోజకవర్గ ముఖచిత్రం

ఒంగోలు సబర్బన్‌: దర్శి అసెంబ్లీ టిక్కెట్‌ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇంకా దోబూచులాట కొనసాగుతూనే ఉంది. సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఇంకా దర్శి టీడీపీ అభ్యర్ధిపై ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వీడనే లేదు. జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి మాత్రం ఒకేసారి 12 మంది అసెంబ్లీ అభ్యర్ధులను, ముగ్గురు పార్లమెంట్‌ అభ్యర్ధులు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శికి ప్రాతినధ్యం వహిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న శిద్దా రాఘవరావును ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్ధిగా ప్రకటించిన విషయం విధితమే.

దీంతో దర్శి అసెంబ్లీ అభ్యర్ధి విషయంలో అధికార టీడీపీకి అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చివరకు ముఖ్యమంత్రి బావమరిది, సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కనిగిరి ఎమ్మెల్యేకు ఆ సీటు విషయంలో చుక్కెదురైంది. దీంతో చివరకు దర్శి నుంచి పోటీ చేయాలని కదిరి బాబూరావును అధిష్టానం ఆదేశించింది. దీనికి సుముఖంగా లేని కదిరి తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారు. అందులో భాగంగా ఇటీవల ఒంగోలు నగరంలో అఖిల భారత కాపు సమాఖ్య నాయకులు జిల్లాలో  కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ కూడా టిడిపి సీటు కేటాయించ లేదని, కనిగిరిలో కదిరికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనంటూ టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు.

ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీలో జిల్లా కాపులకు రెండు సీట్లు కేటాయించారని ఏ ఒక్కరికీ కాపులకు కేటాయించకుండా జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు ఏవిధంగా గెలుస్తారని వారు అప్పట్లో ప్రశ్నించారు. ఆ తరువాత కదిరి తన సన్నిహితులతో పామూరులో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి ఇటు కనిగిరిలోనూ, అటు దర్శిలోనూ నామినేషన్లు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత చివరకు దిక్కులేని స్థితిలో దర్శిలో మంత్రి తనయుడు శిద్దా సుధీర్‌ను నిలబెట్టాలని, అందుకు అధిష్టానం కూడా సమ్మతించాలని మంత్రి కోరారు. దీంతో ఇప్పటి వరకు దర్శి టిక్కెట్‌ విషయంలో అధిష్టానం కూడా కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మళ్లీ సుధీర్‌ దర్శిలో అభ్యర్థిగా ఉండవచ్చన ప్రచారం జోరుగా సాగింది. చివరకు గురువారం ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్ధిగా మంత్రి శిద్దా రాఘవరావు నామినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందలో భాగంగా తిరిగి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు శిద్దా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం రాత్రి శిద్దా నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు కదిరి బాబూరావు కూడా మంత్రి శిద్దాతో సమాలోచనలు జరిపారు. రెండు గంటలపాటు చర్చల అనంతరం చివరకు దర్శి నుంచి తానే పోటీ చేస్తానని కదిరి బాబూరావు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ జరిపిన సమాలోచనల వ్యవహారం మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఇంకా టిక్కెట్ల పంచాయితీ అధికార టీడీపీలో వీడక పోవటంతో కార్యకర్తలు, నాయకుల్లోనే పూర్తిస్థాయి సంశయం నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement