రోజురోజుకూ పెరుగుతున్న ఉద్యమ జ్వాల
Published Sat, Sep 28 2013 2:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రోజులు గడుస్తున్న కొద్దీ పట్టుజారకపోగా.. పట్టుదల మరింత పెరుగుతోంది. ఉద్యమం మహోద్యమంగా మారుతోంది. రైతు, గిరిజన గర్జనలు, సమైక్య జ్వాలలతో సమైక్యాంధ్ర ఉద్యమం జ్వలిస్తోంది. సమైక్య కాంక్షను మరింతగా రగిలిస్తోంది. అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో భాగస్వాములు కావడంతో పాటు జిల్లాలో ఉన్న సుమారు 28 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నెలన్నర రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. గత 57 రోజులుగా జరుగుతున్న జిల్లాలో జరుగుతున్న ఉద్యమంలో చిన్నపాటి హింస కూడా చోటు చేసుకోలేదు. అయితే తమ పిలుపునకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారంటూ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల వద్దకు సమైక్యవాదులు కొందరు వెళ్లి ఫ్లెక్సీలు చించి కింద పడేయడం, వాగ్వాదాలు గత రెండుమూడు రోజుల్లో చోటు చేసుకున్నాయి.
దీనిపై సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, ప్రైవేట్ స్కూళ్ల ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి. చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా పట్టించుకోవద్దన్న జేఏసీ నాయకుల సూచనతో స్కూళ్ల యజమానులు వెనక్కి తగ్గారు. ఈ సమస్య సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో రిమ్స్ వద్ద శుక్రవారం ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యమ చరిత్రలో అరెస్టులు ఇదే తొలిసారి. ఈ సంఘటనలో మొత్తం 46 మందిని అదుపులోకి తీసుకున్నా 13 మందిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇందుకు నిరసనగా శనివారం జిల్లా బంద్‌కు సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న నాయకులను పోలీసులు అనవసంగా రెచ్చగొడుతున్నారని, హింసకు ప్రేరేపిస్తున్నారని ప్రయత్నిస్తున్నారని ఆందోళ నకారులు ఆరోపించారు.
కాగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈనెల 24న జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రతి వ్యాపారి, ఉద్యోగి, అధికారి స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. వ్యాపార సంస్థలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించిన బంద్ కూడా సక్సెస్ అయింది. జిల్లాలో ఒక్క వాహనం కూడా తిరగలేదు. ఎక్కడిక్కడ చిన్న వాహనాలు కూడా ఆపేసి నిరసన తెలిపారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పాలకులపై వ్యంగాస్త్రాలు సంధిస్తూ వివిధ కళా రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో రైతులు, సాధారణ ప్రజలు 48 గంటలు, 72 గంటలు, 78 గంటలు దీక్షలు చేపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పలు నియోజకవర్గాల్లో ఉద్యమం ప్రారంభం నుంచి నిరాహార దీక్షలు సాగిస్తూనే ఉన్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులోనే నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో ప్రతి గ్రామం, మండలంలోనూ నిరాహార దీక్షలు విస్తృతంగా జరిగాయి. మొదటి నుంచీ సమైక్య ఉద్యమంలో ముందుండి పోరాడుతున్న రాజకీయ పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్, టీడీపీలు వివిధ ప్రజా సంఘాల వారు చేస్తున్న ఆందోళన శిబిరాల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో వారు కూడా మిన్నకుండి పోయారు.
సీమాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదంటూ బ్యానర్లు తయారు చేసి ర్యాలీల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయకుండా ఉద్యమంలోకి రావవద్దంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఉద్యమంలో అక్కడక్కడ పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పర్యటనలకు వస్తున్న మంత్రులను నిలదీస్తున్నారు. దీంతో వారు ఉద్యమంలోకి వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకే రాజీనామాలు చేయకుండా ఉన్నామని వారు చెబుతుండగా.. దాన్ని నమ్మడానికి తాము చెవుల్లో పూలు పెట్టుకొని లేమని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులను ఉద్యమకారులు నిలదీయడంతో వారు కనిపించడం మానేశారు.
Advertisement
Advertisement