సమైక్య సమరానికి వైఎస్‌ఆర్ సీపీ సై
Published Mon, Sep 30 2013 3:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ‘నేను సైతం..’ అంటూ మొదటి నుంచీ కృషి చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో మరింతగా మమేకమయ్యేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటి నుంచి పార్టీపరంగా ఉద్యమ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులతో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు(సీజీసీ) దాడి వీరభద్రరావు, జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్‌లు సమావేశమై ఇంతవరకు పార్టీ చేపట్టిన ఉద్యమ కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొంటామన్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్, టీడీపీలు చెప్పడం రాజకీయ కుట్రేనని అన్నారు. విభజన నిర్ణయానికి కారకులైన ఈ రెండు పార్టీలు సీమాంధ్రలో ఉనికి కోల్పోతామన్న భయంతోనే సమైక్య గళం వినిపిస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజల పరిస్థితి దారుణంగా మారుతుందన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో 20 ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయని, ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేసినా వాటి జోలికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే విభజించాలని సోనియా గాంధీ నిర్ణయించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ప్రతిపక్షాలను రాజకీయంగా బలహీనపరచడం, జాతీయస్థాయిలో తెలుగువారి వాణిని వినిపించకుండా చేయడమే ఆమె లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణ బిల్లు పెట్టాలని టీడీపీ రెండుసార్లు లేఖలు రాయడంతోపాటు అఖిలపక్షంపై ఒత్తిడి కూడా తెచ్చిందన్నారు.
తెలంగాణ ఇవ్వాలని వైఎస్‌ఆర్ ఏనాడూ చెప్పలేదని, ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాత్రమే చెప్పారన్నారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తుంటే ప్రజాప్రతినిధులు మాత్రం అధికార దాహంతో పదవులు వీడటం లేదని విమర్శించారు. ఉద్యమంలో చేరి కోవర్టుల్లా పని చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు చూస్తున్నారని, దీన్ని సమైక్యవాదులు గమనించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పడిపోతుందన్న భయం ఉంటేనే కేంద్రం దిగివస్తుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కావడం వల్లే జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలల పాటు జైల్లో ఉంచగలిగారని, ఇది చరిత్రలో మాయని మచ్చగా మిగులుతుందన్నారు. ప్రజల కోసమే వైఎస్‌ఆర్ కుటుంబం అవమానాలు, బాధలు ఎదుర్కొంటున్నదన్నారు. చంద్రబాబు విమర్శిస్తున్నట్లు కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కై ఉంటే జగన్‌పై కేసులే ఉండేవి కావన్నారు.
భవిష్యత్ వైఎస్‌ఆర్ సీపీదేనని, జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, వైఎస్‌ఆర్ ఆశయాలను కొనసాగిస్తారన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుల కణితి విశ్వనాథం, బగ్గు లక్ష్మణరావు, సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వైవీ సూర్యనారాయణ, దువ్వాడ శ్రీనివాసర్, వజ్జ బాబూరావు, విశ్వసరాయి కళావతి, కలమట వెంకటరమణ, కిల్లి రామమోహన్‌రావు, గొర్లె కిరణ్, పీఎంజే బాబులు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు బల్లడ హేమామాలిని రెడ్డి, పిరియా కృష్ణారావు, బల్లాడ జనార్థన్‌రెడ్డి, జీటీ నాయుడు, సవర అన్నపూర్ణ, సంపతిరావు రాఘవరావు, కేవీవీ సత్యనారాయణ, ఎన్ని ధనుంజయ్, మహమ్మద్ సిరాజుద్దీన్, అసదుల్లా, చింతాడ గణపతి, టి.కామేశ్వరి, టి.సావిత్రి ఉన్నారు.
గాంధీ జయంతి నుంచి కార్యాచరణ
02: నియోజకవర్గ కేంద్రాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరవధిక, రిలే దీక్షలు
07: మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముట్టడి
10: అన్ని మండల కేంద్రాల్లో రైతులతో ధర్నాలు
17: నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు
21: నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో నిరసన ప్రదర్శనలు
24: నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు
26: జిల్లాలోని సర్పంచ్‌లు, ఆ పదవులకు పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్ష
29: నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువజనులతో ప్రదర్శనలు
నవంబర్ 1: అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేస్తారు
Advertisement