సమైక్య గణపతి
Published Mon, Sep 9 2013 4:06 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
(సదాశివుని కృష్ణ, న్యూస్‌లైన్, నరసన్నపేట) అది కైలాసం.. ఆదివారం ఉద యం.. విఘ్నరాజు వినాయకుడు చిద్విలాసంగా ఆసీనుడై ఉన్నాడు. సోమవారం వినాయక చవితి సందర్భంగా తనకు జరిగే పూజలు, ఉండ్రాళ్ల ప్రసాదాలను తలచుకొని తనలో తనే మురిసిపోతున్నాడు..
ఆయన పాదాల చెంతనే ఉన్న మూషికుడు ఆ ఊహాలకు బ్రేక్ వేస్తూ గొంతు సవరించుకున్నాడు.. ‘స్వామీ.. చవితి పండుగకు మరో రోజు గడువే ఉంది.. మీ పూజకు భూలోకంలో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని తెగ ఉబలాటంగా ఉంది’ అన్నాడు.. అవే తలపుల్లో ఉన్న గణపయ్యకు ఈ ఐడియా నచ్చింది. ఇక్కడ కూర్చొని ఏవేవో ఊహించుకునే బదులు భూలోకంలో ఒక రౌండ్ వేసి ప్రత్యక్షంగా చూస్తే పోలా’.. అనుకున్నాడు. వెంటనే తలూపుతూ మూషికంపై కూర్చున్నాడు. ఇద్దరూ భూలోకం వైపు కదిలారు...
కట్ చేస్తే...
భూలోకం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం..
మూషిక వాహనంపై ఆకాశయానం చేస్తున్న గణపతి యధాలాపంగా కిందికి చూశాడు. పట్టణమంతా కోలాహలంగా కనిపించింది. ఉత్సాహం అపుకోలేక పట్టణంలోకి తీసుకెళ్లమని మూషికుడికి ఆదేశించాడు. చిత్తం ప్రభూ.. అంటూ మూషికుడు అలాగే చేశాడు. నేలపైనే కాలు మోపి ఒక్కసారి చుట్టుపక్కల ప్రాంతాలను తెరిపార చూశారు. రోడ్ల నిండా జనం.. ఏ వీధి.. ఏ రోడ్డు చూసినా షామియానాలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు.. నినాదాల జోరు.. నడిరోడ్డుపైనే వంటావార్పులు.. ఆ దృశ్యాలు చూసి గణాదిపుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ తెలుగు ప్రజలకు నాపై ఎంత భక్తి చవితికి ఒకరోజు ముందే ఇంత భారీ ఏర్పాట్లు.. విందు భోజనాలు సిద్ధం చేసేస్తున్నారు. ఇక పండుగ రోజు ఇంకెంత ఘనంగా చేస్తారో.. అని తెగ ఆనందపడిపోతూ సమీపంలోనే ఒక షామియానా టెంటు వద్దకు చేరుకున్నాడు.
అప్పడు తెలిసింది.. అసలు విషయం.. ఆ షామియానాలు వేసింది.. తన విగ్రహాలను ప్రతిష్ఠించడానికి కావని.. అవి నిరాహార దీక్ష శిబిరాలని!.. వారు చేస్తున్న నినాదాలు.. తనకు జయజయధ్వనాలు కావని.. జై సమైక్యాంధ్ర నినాదాలనీ!!.. గణపతితోపాటు మూషికుడు ఒక్కసారి అవాక్కయ్యారు. వారిలోని ఉత్సాహం ఉడిగిపోయి నీరసం ఆవహించింది. అసలేం జరిగింది. ఉత్సవాలకు బదులు.. ఈ నిరసనలేమిటి? అని గందరగోళంలో పడిపోయిన గజాననుడు ఆ విషయం ఆరా తీసేందుకు మెల్లగా నిరసన దీక్షలో ఉన్న ఒక కార్మికుడి వద్దకు వెళ్లి కదిపాడు..
సదరు కార్మికుడు ఒకసారి గణపయ్య వైపు ఎగాదిగా చూసి చెప్పడం ప్రారంభించాడు. ‘ఏం స్వామి.. అప్పుడే వచ్చేశావా!.. సోమవారం కదా చవితి.. ఎందుకంత తొందర.. అయినా రాష్ట్రం ముక్కలయ్యే ప్రమాదంలో పడి మేమంతా నిరాహార దీక్షలు, బంద్‌లలో ఉంటే.. ఈ నెల జీతాలు కూడా అందలేదు. ఇల్లు గడవడానికే డబ్బుల్లేక అల్లాడిపోతున్నాం.. ఇంక పండులేం చేస్తాం.. నీకు ఉండ్రాళ్లు ఎలా చేయగలం’.. అని నిట్టూర్పు విడిచాడు. రాష్ట్రం రెండు ముక్కలైతే తెలుగు ప్రజలకు జరిగే నష్టాలను సుదీర్ఘంగా వివరించాడు. వాటన్నింటినీ ఓపిగ్గా విన్న బొజ్య గణపయ్య నీరసంగా లేచి అక్కడి నుంచి కదిలాడు. ఈ ఉద్యమాలతో సంబంధం లేని సామాన్య జనాన్ని కదిలించి చూద్దాం.. వారైనా తన పండుగను జరపకపోతారా? అన్న ఆశతో రోడ్డున పోతున్న ఒక వ్యక్తిని ఆపి ఆరా తీశాడు..
‘ఏం చెప్పమంటావు సామీ మా కట్టాలు.. సమ్మెలు, బందుల పున్నాన ఉప్పులు, పప్పుల కానించి.. అన్ని రేట్లు అమాంతం పెరిగిపోనాయి. ఏమీ కొనలేకపోతన్నం.. ఏమీ తినలేకపోతన్నం. రాష్ట్రాన్ని ముక్కలు సేసేత్తామని ఆ కాంగిరేసోల్లు సెప్పినకాడినుంచి రాష్ట్రం అల్లకల్లోలమైపోతున్నాది. బస్సులు నువు.. పనుల్లేవు.. సేతిలో డబ్బులు ఆడటం నేదు.. అన్ని సరుకుల ధరలు పెంచీసినారు. ‘సవితి సెంద్రుడిలా ఆ సెంద్రబాబు ఎనకాముందూ సూడకుండా ఉత్తరం ఇచ్చీసీనాడట.. దాన్నే సూపించి కాంగిరేసు సోనియామాత తెలంగాణ ఇచ్చేయాలని చెప్పీసింది. ‘తాంబూలాలిచ్చీశాం.. తన్నుకుసావండి’ అన్నట్లుంది అల్ల తీరు. ఆల్లు పెట్టిన చిచ్చు రగిలి.. అన్నదమ్ములాంటి మేం ఇక్కడ తన్నుకుంతన్నం. ఏం సెత్తం. రాష్ట్రం కోసం మేం కూడా ఉద్యమంలో సేరినాం.. ఇదేమో.. ఇప్పుడప్పుడే తేలేలా నేదు. ఏం సేయాలో అర్థం కావడంనేదు. ఈలోగా నీ పండుగ ఎల్లిపోచ్చీనాది.. ఏదీ నేకపోయినా .. నీకు పూజ సెయ్యాలి కదా!.. నిరుటంత ఘనంగా కాకపోయినా అప్పో సప్పో సేసి.. నీకు పూజ సేత్తాం.. ఉండ్రాళ్లు పెడతాలేం గానీ.. ముందు ఢిల్లీ కాంగిరేసోల్ల.. ఇక్కడ తెలంగానోల్ల మనసు మార్చు తండ్రీ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా సూడు పెబూ’ అని వేడుకున్నాడు ఆ పామరుడు. అలా సేత్తే వచ్చే చవితిని సేనా ఘనంగా సేత్తామని కూడా ప్రమాణం చేశాడు.
అంతా విన్న వినాయకుడు కాసేపు ఆలోచనాముద్రలో మునిగిపోయాడు. వీరి వాదన సమంజసమే. అన్నదమ్ములాంటి తెలుగు ప్రజలను విడదీయడమేమిటి?.. రాష్ట్రం ఒక్కటిగా ఉంటే సుభిక్షంగా ఉంటుంది కదా.. ఈ ఆలోచన వారికెందుకు రాలేదు??.. అనుకుంటూ ఆ పామరుడి వైపు తెరిపార చూసి.. ‘సరే నాయన.. రాష్ట్రం సమైక్యంగా.. సుభిక్షంగా ఉండేలా చూస్తాను.. తెలంగాణ ఇవ్వాలనుకుంటున్న వారి మనసు మారుస్తాను.. పూజ వేళ్లకు మళ్లీ వస్తాను.. నా పూజలు.. ఉండ్రాళ్ల సంగతి మాత్రం మరిచిపోకేం.. అని గుర్తు చేస్తూ.. జై సమైక్యాంధ్ర అని తను కూడా నినాదం చేస్తూ బొజ్జ నిమురుకుంటూ ముందుకు కదిలాడు గణపయ్య.. గజాననుడి భరోసాతో భక్తుడి మనసు పుల కించింది. ఉత్సాహం ఉప్పొంగింది. తను కూడా జై సమైక్యాం ధ్ర.. జయ హో బొజ్జ గణపయ్య.. అని నినదిస్తూ.. చవితి ఏర్పాట్లకు ముందుకురికాడు.
Advertisement
Advertisement