ఉరకలేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం | Samaikyandhra bandh against Telangana in Srikakulam | Sakshi
Sakshi News home page

ఉరకలేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం

Published Thu, Sep 5 2013 6:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Samaikyandhra bandh against Telangana in Srikakulam

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఇబ్బందులను పక్కనపెట్టి స్వచ్ఛందంగా ప్రజలు సమైక్యాంద్ర పోరులో భాగస్వాములవుతున్నారు. బుధవారం కూడా ధర్నాలు, వంటావార్పు, సహపంక్తి భోజనాలు, నిరాహార దీక్షలతో జిల్లా దద్దరిల్లింది. ఉద్యమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ముందజంలో ఉన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించినా,  పాఠశాలలు, కళాశాలలు మూతబడినా, ఉద్యోగులకు ఇబ్బందులు వచ్చినా లెక్కచేయకుండా ప్రజలు, ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని..లేదంటే రాష్ట్రా న్ని యథావిధిగా ఉంచాలనే డిమాండ్‌తో జైల్‌లో ఆమరణ దీక్ష చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆల యాల్లో పూజలు చేశారు. 
 
   జిల్లా  విశ్వబ్రాహ్మణుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ ఎంహెచ్‌స్కూల్ నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకూ భారీ ర్యాలీ చేశారు. పోట్టి శ్రీరాములు కూడలి, వైఎస్‌ఆర్ కూడలి వద్ద మానవహారం, దీక్షలు చేపట్టారు. గార మండలం శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం వరకు మెగా బైక్ ర్యాలీ చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. విశ్రాంత విద్యుత్ ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. ఆడిట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఎన్‌జీఓ హోమ్ వద్ద రిలే దీక్షలు చేపట్టగా.. కలెక్టరేట్ వద్ద గృహనిర్మాణ, రెవెన్యూ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. జెడ్పీ ఉద్యోగుల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలి వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. 
 
   ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 8 మంది పార్టీ నాయకులు కూర్చున్నారు. బెల్లుపడ ప్రాంతానికి చెందిన రైతు కొచ్చెర్ల ధనుంజయ్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విజిల్స్ ఊదుతూ వినూత్నంగా ర్యాలీ చేశారు. సోంపేటలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో ఇద్దరు పార్టీ నాయకులు కూర్చున్నారు. కవిటి మండంలో టీడీపీ, ఉపాధ్యాయుల రిలే నిరాహర దీక్షలు కొనసాగిం చారు. కంచిలిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో ముగ్గురు నాయకులు పాల్గొన్నారు. కంచిలిలో వైఎస్సార్ సీపీ నాయకులు,దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయ జేఏఈస నాయకులు రోడ్డుపై రుమాలు ఆట ఆడి నిరసన తెలిపారు.  
 
  ఆమదాలవలస నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరందుకుంది. ఉపాధ్యాయులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  జేఏసీ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ దుకాణాల యజ మానులు ర్యాలీ చేశారు. రైల్వేస్టేషన్ కూడలి వద్ద కబడ్డీ ఆట ఆడి నిరసన తెలిపారు. సరుబుజ్జిలి జంక్షన్‌లో సర్పంచ్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీలు కొనసాగాయి. పాలవలస ప్రాథమికోన్నత పాఠశాలకు ఉద్యమకారులు తాళాలు వేశారు. పొందూరులోని ప్రభుత్వ పాఠశాల లకు ఉపాధ్యాయులు సెలవు ప్రకటించారు. బూర్జ జంక్షన్‌లో ఉపాధ్యాయులు కారులను శుధ్రం చేసి నిరసన తెలిపారు. 
 
  టెక్కలి అంబేద్కర్ కూడలిలో కొనసాగుతున్న రిలే దీక్షలలో ఆర్‌ఎంపీ వైద్యులతో పాటు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. నర్సింగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ఆసనాలు వేశారు. స్థానిక టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో వాహనాలతో ర్యాలీ చేపట్టారు. 
 
   పాతపట్నంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దసీది జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నవారికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ సంఘీభావం తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య బాగుం డాలని, రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని, కాంగ్రెస్, టీడీపీ నాయకుల మనసు మార్చాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ నీల మణి దుర్గ అమ్మవారికి వైఎస్సార్‌సీపీ నాయకులు పూజలు చేశారు. హిరమండలంలో వంద అడుగుల జాతీయ పతాకంతో రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ చేపట్టారు.
 
    పాలకొండ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రిలే నిరాహారదీక్షా శిబిరం వద్ద వివిధ ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రిలే నిరశన చేపట్టారు. పాలకొండ ఉమ్మడి ఉపాధ్యాయ ఐక్యవేదిక వద్ద పాలకొండ మండలం తంపటాపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 45 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గోపాలపురం మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు రహదారి మధ్యలో భూమి భాగోతం నాటకం ప్రదర్శించి నిరసన తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు.  వీరఘట్టం మండలం ఒట్టిగెడ్డలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, ఆటో కార్మికులు జలదీక్షలు చేపట్టారు. సీతంపేట మండలం గుమ్మడ వద్ద సంగయ్య మాస్టారు నిరవధిక దీక్షా భగ్నానికి  నిరసనగా గిరిజనులు బంద్ పాటించారు.
 
   నరసన్నపేటలో జేఏసీ దీక్షా శిబిరం వద్ద రెవెన్యూ ఉద్యోగులు దీక్షచేశారు. ఉపాధ్యాయ , విద్యార్థి జేఏసీలు జలదీక్ష చేశారు. కళాశాల అధ్యాపకులు మోకాల్లపై నిరసన తెలిపారు. పోలాకిలో రెవెన్యూ ఉద్యోగులు, జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు. సారవకోట మండలం సవరడ్డపనస వద్ద సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు.
   పలాసలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రెండోరోజూ  రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ధర్మం జయిస్తుంది అనే పౌరాణిక వేషాలతో నాటకాన్ని ప్రదర్శించారు. 
 
 కాశీబుగ్గ బస్టాండ్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా వీరికి వైఎస్‌ఆర్ సీపీ పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు సంఘీభావం. కాశీబుగ్గ మహాత్మగాంధీ విగ్రహం వద్ద ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 30వ రోజుకు చేరుకుంది. కాశీ బుగ్గ ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష పదోరోజూ కొనసాగింది. టెక్కలిపట్నంలో నాలుగోరోజుకు చేరిన రిలే నిరాహార దీక్షకు డాక్టర్ కణితి విశ్వనాథం సంఘీభావం తెలిపారు.  
 
   రాజాంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. అనంతరం మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయం అతను తన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తు నినాదాలు చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, టీడీపీ కార్యకర్తలు మానవహారం చేపట్టారు.  ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సంతకవిటి మండలంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
 
    ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ ప్రధాన గేటు ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహం వద్ద సాష్టంగ నమస్కారం చేసి నిరసన తెలిపారు. రణస్టలం, లావేరు మండలాల్లో  పలుచోట్ట, నిరసనలు, ర్యాలీలు జరిగాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement