
ప్రతీకాత్మక చిత్రం
మొన్న కథువా... నిన్న ఉన్నవ్... నేడు ఇండోర్... ఇలా భారతావనిలో పసిమొగ్గలపై కూడా మృగాళ్లు లైంగిక దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధిస్తూ కేంద్రప్రభుత్వం ఆలస్యంగానైనా సరే అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 16 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించే వరకు జైలు శిక్ష విధిస్తారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే 10 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు ఖాయం. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కారణంగా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.
పెదవాల్తేరు(విశాఖతూర్పు) : లైంగిక నేరాలకు సంబంధించిన వివరాలు సేకరించడమే కాకుండా నిందితులపై నిఘా ఉంచడంలో ప్రపంచంలో భారతదేశం 9వ దేశంగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్‌టొబాగో దేశాలు ఈ విధంగా నిఘా ఉంచుతున్నాయి. లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉంచడం విశేషం. మిగిలిన దేశాలలో న్యాయ, విచారణ సంస్థలకు ఈ వివరాలు అందుబాటులో ఉంచారు.
విశాఖలోనూ పలు సంఘటనలు
విశాఖ జిల్లాలో కూడా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాలికలు అదృశ్యమవుతున్న కేసులు నమోదవుతూనే ఉండడం కలవరపరుస్తోంది. కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ఈవ్‌టీజింగ్ సరేసరి. గడప దాటే మహిళలకు రానురానూ భద్రత లేకుండా పోతోందని మహిళాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మతిస్థిమితం లేని మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో బాలికలపై యాసిడ్‌దాడులు కూడా గతంలో జరిగాయి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో సత్వర న్యాయం
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎన్నాళ్లనుంచో కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. చిన్నారులపై సైతం లైంగిక దాడులు జరగడం దారుణం. ఇటువంటి నిందితులకు ఉరి శిక్షే సరైనది.
– గొండు సీతారాం, అధ్యక్షుడు, ఏపీ చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం,విశాఖపట్నం.
మృగాళ్లకు ఉరే సరైన శిక్ష
కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ అభినందనీయం. చిన్నపిల్లలపై సైతం లైంగిక దాడులకు పాల్పడడం సభ్యసమాజంలో ఉన్నామా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే శిక్షలు విధించడం ద్వారా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి.
– బి.శకుంతల, పిల్లల హక్కుల కార్యకర్త, సీతమ్మధార.
కేంద్ర ఆర్డినెన్స్‌తో మంచి మార్పు
కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చాలాబాగుంది. నిందితులకు ఉరిశిక్ష విధించడం సరైన శిక్ష. అప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుంది. చిన్న పిల్లలపై క్రూరంగా వ్యవహరించడం అవివేకం. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయం. ఆర్డినెన్స్ అమలులో భాగంగా బాధిత కుటుంబాలకు న్యాయంపై తమ సంస్థ పర్యవేక్షణ ఉంటుంది. అత్యాచార బాధితులకు ప్రస్తుతం కేజీహెచ్‌లో ఒన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నాం.
– జి.చిన్మయిదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా మహిళా–శిశు అభివృద్ధి సంస్థ, విశాఖపట్నం.
ఆర్డినెన్స్ యథాతథంగా అమలు చేయాలి
దేశంలో నిర్భయ చట్టం వచ్చిన తరువాత కూడా లైంగిక నేరాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ మంచిదే. అయితే ఈ ఆర్డినెన్స్‌ను యథాతథంగా అమలు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. కొన్ని దేశాలలో లైంగిక నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలి.
– కె.పద్మ, కార్యదర్శి, మహిళా చేతన, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment