సాగర్ దెబ్బ
- డెడ్‌స్టోరేజీకి చేరువులో రిజర్వాయర్
- వట్టిపోయిన కుడికాలువ
- ఎండుతున్న ఖరీఫ్ పైర్లు, నిండుకున్న చెరువులు,కుంటలు
- అడుగంటిన భూగర్భ జలాలు
- చివరకు మంచినీటికీ కటకట
మాచర్లటౌన్ : వర్షాభావంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి అత్యంత సమీపంలో ఉండటంతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కుడి కాలువ పరిధిలో లక్షల ఎకరాలను సాగు చేసుకోవాల్సిన రైతులు ఏం చేయాలో అర్థంకాక మదనపడుతున్నారు. కుడి కాలువ నుంచి ఏటా జూలై మొదటి వారంలో నీటి విడుదల ప్రారంభమవుతుంది. ఈసారి కనీసం తాగు నీటికి కూడా విడుదల చేసే పరిస్థితి లేదు.
వర్షాభావం, సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల లేకపోవటంతో జిల్లాలోని అనేక మండలాల్లో మంచినీటి సమస్య ప్రారంభం కావటంతోపాటు వేలాది ఎకరాల్లో పత్తి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయి ఆయా మున్సిపాలిటీలు, గ్రామాలలో సైతం తాగునీటి సమస్య నెలకొంది. ఇప్పటికే మెట్ట, మాగాణి సాగుకు కరువు దెబ్బ ప్రారంభమైంది. మాచర్ల ప్రాంతంలో జూన్‌నెలలో కొంతమేర వర్షాలు కురి సినా జూలై నెలలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. దీంతో మెట్ట భూములలో 60 శాతం పైగా పంటలు వేయలేదు. బోర్ల కింద నీరు వచ్చే అవకాశం ఉన్న రైతులు మాత్రమే సాగు చేపట్టారు.
కుడి కాలువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఏటా వరి సాగు చేపట్టే తాళ్లపల్లి, పశువేముల, కొత్తూరు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు నీరు విడుదలైతే మాచర్ల మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒకవైపు వర్షాభావం మరోవైపున కాలువలకు నీరు రాకపోవటంతో బోర్లు ఎండిపోయి తాగునీటికి కూడా ప్రజలు అల్లాడుతున్నారు.