అంతా హడావుడే
► భూసార పరీక్షలపై రైతుల అసంతృప్తి
► ఖరీఫ్ ప్రారంభమైనా రైతుకు చేరని ఫలితాలు
► ఇప్పటికీ కొనసాగుతున్న మట్టి నమూనాల సేకరణ
రబీ పంటలు పూర్తయిన అనంతరం మార్చి చివరి నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షల అనంతరం ఫలితాలను కనీసం మే నెల చివరికైనా రైతుకు చేర్చితే ఖరీఫ్ ప్రారంభంలో వాటి ప్రకారం పంటలు సాగు చేసే వీలుంది. అయితే మట్టి నమూనాల సేకరణ ఎప్పుడు మొదలెట్టారో అటుంచితే అందుకు సంబంధించిన పరీక్షలు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వరుణుడి ఆగమనం కూడా పూర్తి కావడంతో భూములు పదునెక్కి రైతులు విత్తు పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయ సిబ్బంది భూసార పరీక్షలు పూర్తి చేసేదెప్పుడు, ఆ ఫలితాలు రైతులకు చేరేదెప్పుడు, వాటి ప్రకారం పంటలు సాగు చేసేదెప్పుడు.. అంతా వృథా ప్రయాస తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా రైతులకు కూడా తెలుసు. అందుకే వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలియాల్సిందిల్లా వ్యవసాయ అధికారులు, ఆ శాఖ సిబ్బందికే.
కర్నూలు (అగ్రికల్చర్) : భూసార పరీక్షల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నిజమే.. వీటి ద్వారా నేలలో ప్రధాన పోషకాలు, సూక్ష్మపోషకాల స్థాయి తెలుసుకుని అందుకు అనుగుణంగా ఎరువులు, తగిన పంటలు చేసుకుని పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు.. నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే మట్టి నమూనాలు సేకరించిన వ్యవసాయ సిబ్బంది వాటిని పరీక్షించి ఆ ఫలితాలను రైతులకు చేర్చితే కదా ఇదంతా సాధ్యమయ్యేది. ఏటా భూసార పరీక్షలంటూ హడావుడి చేయడం తప్ప వాటి ఫలితాలు సకాలంలో రైతులకు చేరవేయడంతో వ్యవసాయ సిబ్బంది విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి నమూనాల సేకరణ జరుగుతుండడం మరీ విడ్డూరం.
మట్టి నమూనాల సేకరణే అస్తవ్యస్థం..
భూసార పరీక్షలకు గ్లోబెల్ పోజిషనింగ్ సిస్టం ద్వారా మట్టి నమూనాలు సేకరించేలా చర్యలు తీసుకున్నారు. అయితే జీపీఎస్ విధానం తూతూ మంత్రంగా అమలవుతుండటంతో మట్టి నమూనాల సేకరణ పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలో 6,32,902 భూకమతాలుండగా 2015-16లో 27,288 మట్టి పరీక్షలు నిర్వహించారు. ఒక రైతు పొలంలో మట్టి నమూనా సేకరిస్తే ఆ ఫలితాలు ఆ భూకమతంలోని రైతులందరికీ వర్తిస్తాయి. గత ఏడాది మట్టినమూనాలు సేకరించిన రైతులతో పాటు ఆకమతాల్లోని ఇతర రైతులకు అంటే 2,05,803 మందికి మట్టి పరీక్షల ఫలితాలు చేర్చారట. వాస్తవంగా ఇందులో 25 శాతం మందికి కూడా భూసార పరీక్ష ఫలితాలు చేరలేదు.
ఈ ఏడాది 68098 మట్టి పరీక్షలు..
2016-17లో 68,098 మట్టి నమూనాలను పరీక్షించి సంబంధిత రైతులతోపాటు కమతంలోని రైతులందరికీ సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయతలపెట్టారు. ఇప్పటి వరకు 65 వేల మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపారు. ఎమ్మిగనూరు కేంద్రానికి 16,945, కర్నూలుకు 16719, డోన్‌కు 12,226 నమూనాలు పంపించారు. ఒకవైపు మట్టి నమూనాల సేకరణ, మరోవైపు మట్టి పరీక్షల నిర్వహణలోనే కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రతి రైతుకూ మట్టి పరీక్ష ఫలితాలు ఇస్తాం
ఈ నెల మొదటివారంలోగా మట్టి నమూనాల సేకరణ, నెలాఖరులోగా మట్టి పరీక్షల నిర్వహణను పూర్తి చేస్తాం. ఈ నెల 20 నుంచి రైతులకు భూసార పరీక్ష ఫలితాలను నమోదు చేసిన కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - శేషారెడ్డి, ఏడీఏ, భూసార పరీక్ష కేంద్రం, ఎమ్మిగనూరు