
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. తమ పార్టీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వానికి పంపినట్టు పేర్కొంది. వారం రోజుల్లోగా పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.