నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరు వు నుంచి అక్రమంగా మట్టి తవ్వుకెళ్లిన వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుడికి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు
తాడేపల్లిగూడెం రూరల్ : నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరు వు నుంచి అక్రమంగా మట్టి తవ్వుకెళ్లిన వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుడికి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం పత్రికా స్వేచ్ఛ కు విఘాతమని ఏపీయూడబ్ల్యుజే నా యకులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి వారు ఒక ప్రకటన చేస్తూ పాత్రికేయుడిని బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు రాసే వార్తా కథనాలను సద్విమర్శలుగా స్వీకరించాలని, అభ్యంతకరమైన విషయాలు ఉంటే వాటిని వివరణలో తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇందుకు విరుద్ధంగా ఫోన్లలో బెదిరించడం తగదన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలకున్న స్వేచ్ఛను గౌరవించాలే తప్ప వాస్తవ విషయాలను వెలుగులోకి తెచ్చిన విలేకరులను బెదిరించడం గర్హనీయమన్నారు. అవసరమైతే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడేది లేదని పేర్కొన్నారు. ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆ పార్టీ నేతలకు తగు సూచనుల చేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎస్‌ఎన్ రాజు, యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షుడు జి.రఘురామ్, కార్యదర్శి వానపల్లి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు యడ్లపల్లి మురళీకృష్ణ, సహాయ కార్యదర్శి ఏవీ నరసింహరావు, ఐజేయూ సభ్యుడు అడపా మాణిక్యాల రావు, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.
బెదిరింపులు తగవు
ఏలూరు : ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించేలా బెదిరింపులకు పాల్పడటం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరులకు తగదని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి కె.వినాయకరావు, కోశాధికారి కేబీఎన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం వారొక ప్రకటన చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీసే కీలక భూమిక పోషించే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపైనా ఉందని వారు పేర్కొన్నారు. నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరువులో మట్టి తవ్వకం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడిని బెదిరించిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలా కానిపక్షంలో జర్నలిస్టులంతా ఉద్యమిస్తారని హెచ్చరించారు. వార్తాంశాల్లో లోపాలు, తప్పులుంటే వివరణలు ఇవ్వాల్సింది పోయి విపరీత ధోరణితో బెదిరించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.