కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యూనివర్సిటీ నంద్యాలలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
నంద్యాల: కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యూనివర్సిటీ నంద్యాలలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. వందేళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ పరిశోధనాకేంద్రం (ఆర్‌ఏఆర్‌ఎస్) ఇక్కడ ఉంది. అలాగే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విత్తనాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఉద్యానవన పరిశోధనాకేంద్రాలు ఉన్నాయి.
సీడ్ ధ్రువీకరణ కేంద్రంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఘనీకృత వీర్యకేంద్రం తదితర సంస్థలు కూడా కొనసాగుతున్నాయి. వ్యవసాయపరంగా అన్ని రకాల విత్తనాలు తయారయ్యే నంద్యాల పట్టణంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన హంగులు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శతాబ్దకాలంగా పరిశోధనలు..: దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో పరిశోధనాకేంద్రాన్ని 1906లో ఏర్పాటు చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇలాంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు దేశంలో చాలా తక్కువ అని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 117 మండలాల రైతులకు ఇక్కడి శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తున్నారు. నంద్యాలలో ఏటా 675 మి.మీ వర్షపాతం నమోదవుతోంది. పరిశోధనలకు ఈ వర్షపాతం అనువుగా ఉంటోంది.
ఈ పరిశోధనా కేంద్రం పరిధిలో అనంతపురం జిల్లాలోని కదిరి, రెడ్డిపల్లి, అనంతపురం పట్టణాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మడకశిర, రెడ్డిపల్లె, నంద్యాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు మరో నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి. పరిశోధనా కేంద్రంలో కేసీకెనాల్‌కు సంబంధించి ప్రత్యేక కాల్వ కూడా ఉండటంతో నీటి సమస్య తలెత్తే ప్రసక్తే ఉండదు. నంద్యాలకు 60కి.మీ దూరంలో1400 ఎకరాల తంగడంచె ఫారం ఉండటంతో స్థల సమస్య ఉండబోదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.