ఓటుతోనే కూల్చేస్తాం | Demanded to fulfill the assurances given by Chandrababu | Sakshi
Sakshi News home page

ఓటుతోనే కూల్చేస్తాం

Published Fri, Dec 21 2018 2:18 AM | Last Updated on Fri, Dec 21 2018 8:11 AM

Demanded to fulfill the assurances given by Chandrababu - Sakshi

టీడీపీ సర్కారు అనుసరిస్తున్న బీసీల అణచివేత వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసి సబ్‌ప్లాన్‌ నిధులను సైతం దారి మళ్లిస్తోందని కన్నెర్ర చేశారు. గత ఎన్నికల సమయంలో వందకుపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏఒక్కటీ అమలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం పట్ల మండిపడ్డారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. తమ ఓటుతో గద్దెనెక్కిన టీడీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లోఅదే ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.బీసీ వర్గాలకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు భారీ స్పందన వ్యక్తమైంది. అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. కుల వృత్తులతో నిరసన తెలిపారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి తెస్తామని ప్రకటించారు.

సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీసీ వర్గాలు మండిపడ్డాయి. చంద్రబాబు సర్కారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. వారికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఏటా 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామన్న హామీని విస్మరించింది. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పింది. బీసీలకు కొత్తగా ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మాటనూ పక్కన పెట్టింది. నేతన్నలకు ఉచితంగా ఇళ్లు, మరమగ్గాలు ఇస్తామంటూ మాయ మాటలు చెప్పింది. మేకలు, గొర్రెల విక్రయ శాలలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వీటి పెంపకందార్లకు మేలు కలుగుతుందని ఆశలు కల్పించింది. కుల వృత్తి దారుల కోసం అన్ని మండల కేంద్రాల్లో అత్యాధునిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఇవే కాదు.. ఇలాంటివి అనేక హామీలిచ్చి, ఓట్లేయించుకొని నాలుగున్నరేళ్లు మాయ మాటలతో గడిపేసింది. ఒక్క హామీ నెరవేర్చలేదు. దీంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాయి. ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలసి నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించాయి.    

వంచనపై ప్రజాగ్రహం
టీడీపీ గద్దెనెక్కాక బీసీలను వంచించడానికి నిరసనగా గుంటూరు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్‌ సీపీ పిలుపుమేరకు ధర్నాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్‌ బీసీ సంఘ అధ్యక్షుడు కూరాకుల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు చంద్రగిరి ఏసురత్నం, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. చిలకలూరిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్‌ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శి  మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ దేవళ్ళ రేవతి, వైఎస్సార్‌సీపీ నేత నిమ్మకాయల చినరాజనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

కర్నూలు, నంద్యాలలో  కదం తొక్కిన బీసీలు
బీసీల ద్రోహి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కర్నూలుతోపాటు నంద్యాలలో బీసీ మహార్యాలీ నిర్వహించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బీసీల చేతిలో చంద్రబాబుకు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఒంగోలులో భారీ ప్రదర్శన
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. పార్టీ బీసీ సెల్‌ ఆధర్వంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ఆందోళన నిర్వహించిన అనంతరం జేసీ–2 మార్కండేయులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. 

విశాఖలో హోరెత్తిన బీసీ ర్యాలీ
ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించింది. బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణ, నగర కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల కులవృత్తులను ప్రతిబింబించేలా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మళ్ల, తైనాల తదితరులు మాట్లాడుతూ ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో కనీసం పదివేల కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.  

బీసీలంటే బాబుకు చిన్నచూపు
బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు అని రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలో పసుపులేటి సుధాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యే గడికోట మాట్లాడుతూ బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ అధ్యయన కమిటీని నియమించారని చెప్పారు. జస్టిస్‌ ఈశ్వరయ్య లేఖ ద్వారా బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో బహిర్గతమైందన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును గద్దె దించేందుకు బీసీలు సమాయత్తం కావాలన్నారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూడటం బాబుకు అలవాటన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ర్యాలీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, పాతబస్టాండు, ఆర్‌ఎస్‌రోడ్డు మీదుగా సబ్‌కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం ఆర్డీవో కోదండరామిరెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు. 

‘అనంత’లో నిరసన ర్యాలీ..
టీడీపీ సర్కారు బీసీలను మోసగించటానికి నిరసనగా అనంతపురం, హిందూపురంలో  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. పార్లమెంటు సమన్వయకర్త  తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిష్టప్ప, రాగే పరుశురాం, కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషశ్రీచరణ్, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. హిందూపురంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడ్డారు.

త్వరలో బీసీ గర్జన...
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణ, రజక, వడ్డెర కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవినాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర పూర్తి కాగానే బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తామని చెప్పారు. బీసీలంతా వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించి పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. మామకు  వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నట్లే చంద్రబాబు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మైదుకూరు శాసనసభ్యుడు ఎస్‌. రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

విజయనగరం, పార్వతీపురంలో ర్యాలీలు..
బీసీలను అణచివేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయనగరం, పార్వతీపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బీసీలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని పార్టీ నేతలు సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై విజయనగరం డీఆర్వో జె.వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాలూరు, పాలకొండ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, వి.కళావతి ఇతర నాయకులు పాల్గొన్నారు.

తిరుపతిలో కుల  వృత్తులతో నిరసన.. 
ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ చిత్తూరు కలెక్టరేట్, తిరుపతిలోని సబ్‌కలెక్టరేట్‌ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుపతిలో బీసీ కుల వృత్తులను ప్రదర్శించారు. అన్నమయ్య సర్కిల్‌ నుంచి సబ్‌కలెక్టర్‌ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

డబ్బులతో గెలవాలనుకునే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి... 
ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలను చంద్రబాబు హరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అ«ధ్యక్షతన విజయవాడలోని ధర్నా చౌక్‌లో వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా కొత్తవి సృష్టించేలా చంద్రబాబు పాలన తయారైందని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా గమనించిన ఇద్దరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చెబుతున్న విషయాలు వింటుంటే రాష్ట్రంలో ఏమేరకు అవినీతి జరిగిందో అర్ధమవుతోందన్నారు.

రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయాన్నారు. అణగారిన ప్రజల అభివృద్థి పట్ల వైఎస్‌ జగన్‌కు  స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు  వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్‌ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు బోను రాజేష్, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు ర్యాలీగా విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందచేశారు. 

గత ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చి నెరవేర్చని వాటిలో ప్రధానమైనవి..
►ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌  
►విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెంపు.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు  
►బీసీలకు కొత్తగా రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు
►  చేనేత కార్మికులకు రూ.1.5 లక్షలతో  ఉచితంగా ఇళ్లు, మగ్గం 
►రైతుబజార్ల తరహాలో మేకలు, గొర్రెల విక్రయ బజార్ల ఏర్పాటు  
►అన్ని మండల కేంద్రాల్లో కుల
►వృత్తిదారులకు ఆధునిక అభివృద్ధి కేంద్రాలు 
► బీసీ కులాలను ఒక గ్రూపునుంచి మరో గ్రూపులోకి మారుస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement