క్షయ విభాగంలో డబ్బు జబ్బు
సాక్షి, ఏలూరు : ప్రభుత్వ శాఖలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలొస్తే వాటి అధిపతులు వెంటనే సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రంలో అవినీతికి అడ్డూపదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. చిన్నపాటి వర్షానికే నీరుచేరి ముంపుబారిన పడే ఈ కార్యాలయానికి ప్రహరీ గోడను నిర్మించుకోలేకపోతున్నప్పటికీ.. తప్పు డు బిల్లులతో సొమ్ములు దోచుకుంటున్నారు. క్ష య నివారణ కేంద్రంలో 22 మంది శాశ్వత , 46 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా, డీఎంహెచ్‌వో ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ఈ విభాగంలో ప్రతి పనీ వీరి ఆదేశాలకు లోబడే జరగాలి. కానీ ఎన్ని ఆరోపణలొచ్చినా ఈ విభాగంపై ఉన్నతాధికారులుదృష్టి సారించకపోవడం విశేషం.
పొంతనలేని లెక్కలు
ఈ విభాగం అవసరాల కోసం ఇటీవల కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విసృ్తత వాడుకలోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో సాధారణ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు రూ.52వేలు ఖర్చయ్యిందంటే ఆశ్చర్యమే. రేకు బీరువాలకు గోద్రేజ్ అని స్టిక్కర్ వేసి తీసుకువచ్చేశారు. చిన్నసైజు ప్రింటర్, స్కానర్లకు రూ.24 వేలు ఖర్చు చూపించారు. రెండు కంప్యూటర్ టేబుళ్ల కోసం రూ.9,300 లెక్క చూపారు. కంప్యూటర్ ముందు కూర్చోవడానికి కొన్న కుర్చీ ఖరీదు రూ.7,200. ఇలాంటివి మూడు కొన్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఇవన్నీ ఒకే కాంట్రాక్టరు నుంచి తీసుకున్నారు. ఒక్కో వస్తువుకు ముగ్గురు కాంట్రాక్టర్లు బిడ్ వేసినప్పటికీ అన్ని టెండర్లలోనూ ఆ కాంట్రాక్టర్‌కు చెందిన కంపెనీయే తక్కువ మొత్తం కోట్ చేసిందట. లక్షలు ఖరీదు చేసే టీబీ మం దులను పాడవకుండా చూసేందుకు ఏసీ అమర్చేలా 2009లో అనుమతి లభించినప్పటికీ నేటికీ కొనలేదు. కానీ దాదాపు రూ.1,98,265 ఖర్చు చేసి ఫర్నిచర్ కొన్నారు. లెక్కల్లో చూపిన ఖర్చులో సుమారు సగం సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోరుుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లులను ధ్రువీకరించిన ఉన్నతాధికారుల భాగస్వామ్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ అక్కమాల చిట్టా
గతేడాది డిసెంబర్ 9వ తేదీన స్థానిక ఆర్‌ఆర్ పేటలోని డీసీసీబీ బ్యాంకు నుంచి క్షయ నివారణ శాఖకు చెందిన ఇద్దరు కాంట్రాక్టు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా పే స్లిప్‌లు సృష్టించి ఒక్కొక్కరూ రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా రూ.200 చొప్పున కమిషన్‌ను ఉన్నతాధికారికి సమర్పించేవారు. ఈ విషయాలను ‘సాక్షి’ అప్పట్లో బయటపెట్టటంతో డబ్బులు తీసుకోవడం మానేశారు. ల్యాబ్‌కు ఉపయోగించే పరికరాలను రూ.2.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసేందుకు బడ్జెట్ నిధులు విని యోగించారు. వాటిలో సగం సొమ్ము పక్కదారి పట్టిందని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ విభాగంలో కోట్లాది రూపాయల బడ్జెట్ లావాదేవీలన్నీ ఓ తాత్కాలిక ఉద్యోగి చేతుల మీదుగా నడుస్తున్నాయి. ఇదే ఉద్యోగి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, అకౌంటెంట్‌గా రెండు ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఓ పోస్టు ఖాళీ చూపించారు. కానీ.. దానిని భర్తీ చేయకుండా అదే కాంట్రాక్టు ఉద్యోగి నేటికీ రెండు జీతాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నా దృష్టికి రాలేదు
క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో రూ.లక్షలు ఖర్చుచేసి వస్తువులు కొన్న విషయం నా దృష్టికి రాలేదు. ఈ విభాగానికి సంబంధించి ఏది కొనాలన్నా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డిస్ట్రిక్ కోఆర్డినేషన్ హెల్త్ సర్వీసెస్ అధికారి, జిల్లా క్షయ నివారణాధికారి అనుమతి ఉండాలి. సిబ్బంది ఏం కొన్నారు, ఎంత ఖర్చు చేశారనే అనే విషయాలను పరిశీలించి ఒకటి రెండు రోజుల్లో చెబుతాను.
-లక్ష్మణ్ జితానంద్, జిల్లా క్షయ నివారణ శాఖ ఇన్‌చార్జి అధికారి